ఆప్ ఎమ్మెల్యేలకు లై డిటెక్టర్ పరీక్ష చేయించాలి.. ఢిల్లీ బీజేపీ డిమాండ్

By Sumanth KanukulaFirst Published Aug 31, 2022, 2:55 PM IST
Highlights

ఆప్ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలపై బీజేపీ స్పందించింది. తమను బీజేపీ సంప్రదించిందని, పార్టీ మారేందుకు రూ. 20 కోట్ల వరకు ఆఫర్ చేసిందని ఆప్ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. 

ఆప్ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలపై బీజేపీ స్పందించింది. తమను బీజేపీ సంప్రదించిందని, పార్టీ మారేందుకు రూ. 20 కోట్ల వరకు ఆఫర్ చేసిందని ఆప్ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలపై ఫోరెన్సిక్ విచారణకు సంబంధించిన అంశమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. వారికి లై డిటెక్టర్ పరీక్ష చేయించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ, రమేష్ బిధూరి, హన్స్ రాజ్ హన్స్, పర్వేష్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ ‘అవినీతి వ్యతిరేక’ పార్టీగా డ్రామా చేస్తోందని.. దర్యాప్తులో వారేమిటనేది  తేలిపోతుందని అన్నారు. 

“బీజేపీ వారికి రూ. 20 కోట్ల వరకు డబ్బు ఆఫర్ చేసిందని వారు చెప్పారు. కావున అది ఫోరెన్సిక్ విచారణకు సంబంధించిన అంశం. వారికి ఫోన్ చేసిన వారి పేర్లను ఎందుకు బయటపెట్టడం లేదు?. వారిని సంప్రదించిన వారిపై ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోలేదు?’’ అని మనోజ్ తివారీ ప్రశ్నించారు. ఎక్సైజ్ పాలసీ అంశంపై ఆప్ నేతలు ఎప్పటికప్పుడు వారి ప్రకటనలను మారుస్తున్నారని విమర్శించారు. ఎవరికి ఫోన్  వచ్చిందో స్పష్టం చేయాలని బీజేపీ ఎంపీలు కేజ్రీవాల్‌ను కోరుతున్నారని తివారీ అన్నారు. దీనిపై విచారణ జరిపేంత వరకు నిజం బయటకు రాదని చెప్పారు. దీనిపై ఫోరెన్సిక్ పరీక్ష చేయాలని.. ఇందుకు సంబంధించి ఫోన్ కాల్స్ వచ్చిన వారందరి ఫోన్‌లను దర్యాప్తు సంస్థ తీసుకుని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

ఇక, ఆప్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు బీజేపీ రూ. 20 కోట్లు ఆఫర్ చేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,  డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ఢిల్లీలోని ఏడుగురు బీజేపీ ఎంపీలు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. 

కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇతర ఆప్ నాయకుల ఆరోపణను.. దురుద్దేశపూరితమైనవని, తప్పుదోవ పట్టించేవని బీజేపీ ఎంపీలు పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వ మద్యం కుంభకోణం నుంచి దృష్టిని మళ్లించే ప్రయత్నం అని ఆరోపించారు. ఇక, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో జరిగిన అవకతవకలపై దర్యాప్తులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ నిందితుడిగా పేర్కొంది.
 

click me!