మధ్యాహ్నం 2 గంటలకు హైకోర్టును పేల్చేస్తాం.. స్వాతంత్ర దినోత్సవం వేళ బాంబు బెదిరింపు

Published : Aug 14, 2026, 07:11 PM IST
Delhi Bomb Threat

సారాంశం

Delhi Bomb Threat: 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఒక్కరోజు ముందు దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. ఢిల్లీ హైకోర్టు, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటామంటూ శుక్రవారం బెదిరింపు ఈమెయిల్ వచ్చింది.

2:11 గంటలకు పేలుడు.. అంటూ బెదిరింపు

“Blast Delhi High Court @2:11 PM” అనే శీర్షికతో ఈ బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం 2:11 గంటలకు ఢిల్లీ హైకోర్టులో బాంబు పేలుతుందని, ఆ తర్వాత గంటకు ఢిల్లీలోని జిల్లా కోర్టుల్లో పేలుళ్లు జరుగుతాయని ఈమెయిల్‌లో పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని కోర్టుల్లో సిక్కులకు వ్యతిరేకంగా కేసులు నడుస్తున్నాయంటూ ఈమెయిల్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అలాగే ఢిల్లీని ఖలిస్థాన్‌గా మారుస్తామని బెదిరించినట్లు తెలుస్తోంది. ఈమెయిల్‌లో ఖలిస్థాన్ పేరును ఉపయోగించినప్పటికీ, బెదిరింపు వెనుక ఉన్న వ్యక్తులు లేదా సంస్థకు సంబంధించి దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ధారణ చేయలేదు.

పలు ప్రాంతాలకు బెదిరింపులు.. తనిఖీలు ముమ్మరం

ఢిల్లీ హైకోర్టు, IGI విమానాశ్రయం మాత్రమే కాకుండా మరో ఆరు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటామని బెదిరింపు వచ్చినట్లు సమాచారం. వాటిలో జామ్నగర్ హౌస్, జండేవాలన్ భవనం, సాకేత్ కార్యాలయం, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం, IGI టెర్మినల్-3, ఢిల్లీ కాంట్‌లోని SDM కార్యాలయం ఉన్నాయి. అంతేకాకుండా ఢిల్లీ మెట్రో, అంబాలా వైపు వెళ్లే రైళ్లను కూడా లక్ష్యంగా చేసుకుంటామని బెదిరించినట్లు అధికారులు తెలిపారు.

సమాచారం అందిన వెంటనే ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచారు. అగ్నిమాపక వాహనాలను పలు ప్రాంతాలకు తరలించి తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులు ఏవీ గుర్తించలేదని సమాచారం.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు ఇలాంటి బెదిరింపు రావడంతో భద్రతా సంస్థలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. బెదిరింపు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని వెనుక ఎవరున్నారు, అది నిజమైన ముప్పా లేక తప్పుడు హెచ్చరికా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal Floods: కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? అసలు కారణమిదే..నేపాల్ లో మరోసారి బీభత్సం
ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం