శకటాల వివాదంలోకి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎంట్రీ.. స్టాలిన్, దీదీలకు సమాధానం

By Mahesh KFirst Published Jan 18, 2022, 4:06 PM IST
Highlights

తమ శకటాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయకపోవడంపై పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ వివాదంలోకి తాజాగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎంట్రీ ఇచ్చి ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమాధానం ఇచ్చారు. ఇద్దరు సీఎంలకు లేఖ రాసి.. శకటాల ఎంపిక పారదర్శకంగా జరిగిందని, అందులో అనుమానపడాల్సిన పనేం లేదని పేర్కొన్నారు.
 


న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుక(Republic Day Celebrations)ల్లో శకటాల(tableaux) ఎంపికపై కొన్ని రాష్ట్రాలు కేంద్రంపై గుర్రుగా ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్(West Bengal), తమిళనాడు(Tamilnadu) రాష్ట్రాలు.. తాము పంపిని శకటాలను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఈ విషయమై లేఖలు రాశారు. ఈ దుమారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh) ఎంట్రీ ఇచ్చారు. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసి సమాధానాలు ఇచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ థీమ్‌తో పశ్చిమ బెంగాల్ ఒక శకటాన్ని కేంద్రానికి సూచించింది. కానీ, ఆ శకటం గణతంత్ర దినోత్సవాల్లో నిర్వహించే పరేడ్‌కు ఎంపిక కాలేదు.

ఈ నెల 16వ తేదీన రాసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీకి రాసిన ఉత్తరాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో విశేష పోరాటం చేశారని తెలిపారు. ఆయనను భారత ప్రజలు ఎప్పటికీ విస్మరించబోరని పేర్కొన్నారు. మరో విషయం కూడా దీదీకి గుర్తు చేయదలిచినట్టు వివరించారు. ప్రతి ఏడాది నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని గణతంత్ర దినోత్సవాల్లో భాగం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించిందని, ఇక నుంచి ప్రతి యేటా జనవరి 23వ తేదీ నుచే గణతంత్ర దినోత్సవాలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. 

ఈ పరేడ్‌లో పాల్గొనే శకటాల ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగిందని మమతా బెనర్జీ ఆయన తన లేఖలో వివరించారు. కళా, సంస్కృతి, పెయింటింగ్, విగ్రహ, సంగీతం, ఆర్కిటెక్చర్, కొరియోగ్రఫీ సహా పలు రంగాల్లో నిష్ణాతులతో ఏర్పడిన నిపుణుల కమిటీ ఈ శకటాల ఎంపికను పలుమార్లు భేటీ అయి నిర్వహిస్తుందని తెలిపారు. శకటం థీమ్, కాన్సెప్ట్, డిజైన్, దాని చూడటానికి ఎలా ఉంది? వంటి అనేక విషయాలను ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత శకటాల ఎంపికకు వారు సిఫారసులు చేస్తారు. గణతంత్ర దినోత్సవాల్లో శకటాల పరేడ్‌కు కేటాయించిన సమయంపైనే ఎంపికయ్యే శకటాల సంఖ్య ఆధారపడి ఉంటుందని తెలిపారు.

శకటాల ఎంపిక కోసం ప్రత్యేక వ్యవస్థే ఉన్నదని, దాని సూచనల మేరకే రక్షణ శాఖ శకటాల ప్రతిపాదనలను ఆహ్వానిస్తుందని పేర్కొన్నారు. వచ్చిన ప్రతిపాదనలపై ఆ కమిటీ దశలుగా సమావేశమై.. ఎంపిక చేస్తుందని తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియ అంతా కూడా పారదర్శకంగా ఉంటుందని వివరించారు. మరొక విషయం ఈ సారి కేంద్ర శాఖ సీపీడబ్ల్యూడీ కూడా నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్న శకటాన్ని ప్రతిపాదించిందని తెలిపారు. కాబట్టి, ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల శకటాల ఎంపిక ఉద్దేశపూర్వకంగా చేయలేదనే ఆరోపణలు అవాస్తవాలని కొట్టిపారేశారు. మరొక విషయం 2016, 2017, 2019, 2021 సంవత్సరాల్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పశ్చిమ బెంగాల్ శకటాలు పరేడ్ చేశాయని గుర్తు చేశారు.

కాగా, తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కూడా ఇదే తరహాలో లేఖ రాసి.. ఎంపిక ప్రక్రియను వివరించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం కోసం తమిళనాడు నుంచి సహా మొత్తం 29 శకటాల ప్రతిపాదనలు వచ్చాయని, తమిళనాడు ప్రతిపాదనను మొదటి మూడు రౌండ్ల సమావేశం వరకు పరిగణనలోకి తీసుకున్నారని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. అయితే, 12 శకటాలతో కూడిన తుది జాబితాలోకే తమిళనాడు ప్రతిపాదిత శకటం చేరలేకపోయిందని తెలిపారు. తమిళనాడు నుంచి 2017, 2019, 2020, 2021 గణతంత్ర వేడుకల్లో శకటాలు ఢిల్లీలో పరేడ్ చేశాయని గుర్తు చేశారు. కాబట్టి, శకటాల ఎంపికలో ఎలాంటి వివక్ష లేదని, నిర్దేశిత సూత్రాలకు అనుగుణంగానే ఎంపిక జరిగిందని వివరించారు.

click me!