హిమచల్ ప్రదేశ్‌లో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇక్కడ బలం లేకున్నా బీజేపీ ఒక రాజ్యసభ స్థానాన్ని గెలుచుకుంది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ వేసినట్టు తెలుస్తున్నది. అంతేకాదు, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే సంకేతాలను ఇచ్చింది. దీంతో సుక్కు ప్రభుత్వ మనుగడకే ముప్పుగా మారింది.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ రణరంగం కనిపించింది. అక్కడ ఒక్క రాజ్యసభ సీటు కూడా గెలుచుకునే బలం బీజేపీకి లేదు. కానీ, ఇప్పుడే ఒక రాజ్యసభ సీటు గెలుచుకున్నట్టు హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ప్రకటించింది.
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సుఖ్విందర్ సింగ్ సుక్కు సీఎం. ఇక్కడ 40 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముగ్గురు ఇండిపెండెంట్ల మద్దతు ఉన్నది. ఇక బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ మూడు రాజ్యసభ సీట్ల కోసం ఎన్నికలు జరిగాయి. లెక్క ప్రకారం, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో మూడు రాజ్యసభ సీట్లను కాంగ్రెస్ సునాయసంగా గెలుచుకోగలదు. కానీ, బీజేపీ తెరవెనుక వ్యూహాన్ని అమలు చేసినట్టు తెలుస్తున్నది.
ఇక్కడ ఒక్క రాజ్యసభ సీటును గెలుచుకోవడానికైనా బీజేపీకి అదనంగా 9 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. ఈ బలం కోసం బీజేపీ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలో పడింది.
Also Read: CM Jagan: 45 రోజుల్లో ఎన్నికలు.. ప్రకటించినవారే అభ్యర్థులు: సీఎం జగన్
ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలనూ బీజేపీ కిడ్నాప్ చేసిందని, వారిని బీజేపీ పాలిత హర్యానా రాష్ట్రంలోని ఓ గెస్ట్ హౌజ్‌కు తరలించిందని సీఎం సుక్కు అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారపక్షం, ప్రతిపక్షం ఉంటుందని, కానీ, ఇక్కడ బీజేపీ గూండాగిరి చేస్తున్నదని పేర్కొన్నారు.
ఇక్కడ కేవలం క్రాస్ ఓటింగ్ మాత్రమే కాదు.. సుక్కు ప్రభుత్వానికి ముప్పు వచ్చేలా బీజేపీ పరిస్థితులను మార్చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ పాలిత రాష్ట్రానికి తరలించిన కమలం పార్టీ.. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెడుతామనే సంకేతాలు ఇచ్చింది.