కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ల మార్కెట్ విక్రయానికి అనుమతి..

By Sumanth KanukulaFirst Published Jan 27, 2022, 5:12 PM IST
Highlights

భారత్‌లో వ్యాక్సినేషన్‌లో కోవాగ్జిన్ (Covaxin), కోవిషీల్డ్ (Covishield) టీకాలది కీలక పాత్ర. అయితే తాజాగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెట్ విక్రయానికి అనుమతి లభించింది. బహిరంగ మార్కెట్‌లో విక్రయానికి సంబంధించి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గురువారం షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. 

భారత్‌లో వ్యాక్సినేషన్‌లో కోవాగ్జిన్ (Covaxin), కోవిషీల్డ్ (Covishield) టీకాలది కీలక పాత్ర. అయితే తాజాగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెట్ విక్రయానికి అనుమతి లభించింది. బహిరంగ మార్కెట్‌లో విక్రయానికి సంబంధించి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గురువారం షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. దీంతో ఈ రెండు టీకాలు ఇకపై సాధారణ మార్కెట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ.. కొన్ని షరతులకు లోబడి పెద్దల జనాభాకు ఈ రెండు వ్యాక్సిన్ల మార్కెట్ విక్రయానికి ఆమోదం తెలుపాలని సిఫార్స్ చేసింది. ఈ నేపథ్యంలో డీసీజీఐ తాజాగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల మార్కెట్ విక్రయానికి ఆమోదం తెలిపింది. షరతులకు లోబడి కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల విక్రయానికి అనుమతి ఇచ్చినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ట్వీట్ చేశారు. 

అయితే బహిరంగ మార్కెట్‌లో అందుబాటులో ఉండటం అంటే.. మెడికల్ షాప్‌ల్లో వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉంటాయని కాదు. ప్రజలు ఆస్పత్రులు, క్లినిక్‌ల నుంచి కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక, టీకా డేటా ప్రతి ఆరు నెలలకు DCGIకి సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా CoWIN యాప్‌లో కూడా డేటా అప్‌డేట్ చేయబడాలి. ప్రతికూల ప్రభావాలపైనా పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

ఇక, కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు అత్యవసర వినియోగానికి గతేడాది జనవరిలో భారత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్‌‌లో ఈ రెండు టీకాలదే ముఖ్య పాత్ర. అయితే కొద్ది రోజులుగా బహిరంగ మార్కెట్‌లో విక్రాయానికి అనుమతించాలంటూ కోవాగ్జిన్ అభివృద్ది చేసిన భారత్ బయోటెక్, కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ సంస్థలు.. డీసీజీఐకి దరఖాస్తు చేసుకన్నాయి.  

అయితే తాజాగా ఇందుకు సంబంధించి కీలక అంశాలు వెల్లడించాల్సి ఉంది. బహిరంగ మార్కెట్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల ఒక్క డోసు రూ. 275గా నిర్ణయించినట్టుగా, సర్వీస్ చార్జీ మరో రూ. 150 ఉంటుందనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌  సెంటర్లలో  కోవాగ్జిన్‌ ధర ఒక డోస్‌కు 1,200రూపాయలుగా ఉండగా.. కోవిషీల్డ్‌ ధర రూ. 780గా ఉంది. వీటికి అదనంగా రూ. 150 సర్వీస్‌ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది.

click me!