ఇండియాలో థర్డ్‌వేవ్ భయం: 46 జిల్లాల్లో 10 శాతానికిపైగా పాజిటివిటీ రేటు

By narsimha lodeFirst Published Aug 1, 2021, 11:41 AM IST
Highlights

ఇండియాలోని  46 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా నమోదౌతున్నాయి. అలసత్వం, నిర్లక్ష్యం కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. కేసుల పెరుగుదలను అరికట్టకపోతే థర్డ్‌వేవ్ ప్రమాదాన్ని తోసిపుచ్చలేమని అధికారులు చెబుతున్నారు.

న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 41,831 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా యాక్టివ్ కేసులు 4.10 లక్షలకు చేరుకొన్నాయి.యాక్టివ్ కేసులు ప్రస్తుతం 1.30 శాతంగా ఉన్నాయి. అయితే వీక్లీ పాజిటివిటీ రేటు 2.42 శాతంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న ఒక్క రోజే కరోనాతో 541 మంది మరణించారు. అయితే 39,258 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  కరోనా మృతుల సంఖ్య 4,24,351కి చేరుకొంది.

శనివారం నాడు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ భూషన్  నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. దేశంలో కరోనా పరిస్థితులపై సమీక్షించారు మంత్రి. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అసోం, మిజోరం, మేఘాలయా, ఆంధ్రప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో కరోనా కేసులపై సమీక్షించారు.

ఈ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్టుగా అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు గాను ప్రజలు గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆయా రాష్ట్రాలను కోరారు.కరోనా పాజిటివిటీ రేటు పెరగడానికి నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. గతంతో పోలస్తే కరోనా కేసులు 40 వేలుగా నమోదౌతున్నందున ఏ మాత్రం సంతృప్తి చెందవద్దని ఈ సమావేశంలో పాల్గొన్న ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ్ హెచ్చరించారు.

దేశంలోని 46 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా నమోదైందని అధికారులు చెప్పారు. మరో వైపు 53 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 5 నుండి 10 శాతంగా నమోదౌతుందని తెలిపారు.కరోనా కేసుల సంఖ్య పెరిగితే థర్డ్ వేవ్ ప్రమాదం పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.


 

click me!