కరోనాతో ఇండియాలో ఒక్కరు మరణించినా తనను కలవరపెడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మాస్కులు లేకుండా ప్రజలు ఎవరూ కూడ బయటకు రావొద్దని ఈ మేరకు ముఖ్యమంత్రులు చర్యలు తీసుకోవాలన్నారు.
న్యూఢిల్లీ: కరోనాతో ఇండియాలో ఒక్కరు మరణించినా తనను కలవరపెడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మాస్కులు లేకుండా ప్రజలు ఎవరూ కూడ బయటకు రావొద్దని ఈ మేరకు ముఖ్యమంత్రులు చర్యలు తీసుకోవాలన్నారు.
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో ఏం చేద్దామనే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.ఇవాళ , రేపు ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
గత కొన్ని వారాలుగా వేలాది మందిని విదేశాల నుండి భారతదేశానికి తిరిగి వచ్చారన్నారు. వలస కార్మికులు తమ స్వంత రాష్ట్రాలకు చేరుకొన్నారని ఆయన గుర్తు చేశారు. దాదాపుగా అన్ని రవాణా విధానాలు తిరిగి కార్యకలాపాలను ప్రారంభించినట్టుగా మోడీ తెలిపారు. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే కరోనా ప్రభావం ఇండియాలో తక్కువేనన్నారు.
కరోనా ప్రభావం లేని 21 చిన్న, ఈశాన్య , హిమాలయ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడనున్నారు. కరోనా నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఆర్ధిక పరిస్థితులతో పాటు ఇతర విషయాలపై ఆయన సీఎంలను అడిగి తెలుసుకొన్నారు.
ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని పీఎం మోడీ చెప్పారు. మాస్కులు లేకుండా ఇంటి నుండి బయటకు రావొద్దని ఆయన ప్రజలను కోరారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలోనే కరోనా సోకిన రోగులు రికవరీ రేటు పెరిగిందన్నారు.
కరోనా అన్ లాక్ ప్రారంభించి రెండు వారాలు దాటింది. ఈ సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకొనేందుకు మీతో మాట్లాడుతున్నట్టుగా మోడీ చెప్పారు.
క్షేత్రస్థాయి నుండి వచ్చే సమాచారం ఆధారంగా భవిష్యత్తులో తాము తీసుకొనే నిర్ణయాలకు ప్రయోజనంగా ఉంటుందని ప్రధాని చెప్పారు.ఈ నెలాఖరుతో ఐదో విడత లాక్ డౌన్ పూర్తి కానుంది. ఈ తరుణంలో సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ను ప్రధాని నిర్వహిస్తున్నారు.