24 గంటల్లో కొవాగ్జిన్‌కు అనుమతి!.. డబ్ల్యూహెచ్‌వో ఏం చెప్పిందంటే..

By telugu teamFirst Published Oct 26, 2021, 8:04 PM IST
Highlights

భారత్ బయోటెక్‌కు డబ్ల్యూహెచ్‌వో శుభవార్త చెప్పింది. అన్ని అనుకున్నట్టు జరిగితే, టీకా డేటాపై సాంకేతిక కమిటీ సంతృప్తి చెందితే 24 గంటల్లో అత్యవసర వినియోగ అనుమతులకు సిఫారసు చేయవచ్చునని ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. భారత్ బయోటెక్ సమర్పించిన డేటాను సాంకేతిక కమిటీ సమీక్షిస్తున్నదని వివరించారు.
 

న్యూఢిల్లీ: హైదరబాద్‌కు చెందిన Bharat Biotech ఐసీఎంఆర్‌తో కలిసి అభివృద్ధి చేసిన Covaxin టీకాను కోట్లాది మంది తీసుకున్నారు. అత్యవసర వినియోగ అనుమతులు పొందిన ఈ టీకాను పంపిణీ చేస్తున్నారు. అయితే, ఈ టీకా పొందిన వారు విదేశాలకు వెళ్లడం కష్టతరంగా మారింది. అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ టీకాకు ఇంకా అనుమతులు ఇవ్వలేదు. చాలా దేశాల రెగ్యులేటరీలు టీకా అనుమతులకు WHO ఇచ్చే ఈ అనుమతులపై ఆధారపడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కొవాగ్జిన్ టీకా వేసుకున్న భారతీయులకు విదేశీ ప్రయాణం సంకటంగా మారింది. అయితే, డబ్ల్యూహెచ్‌వో కొవాగ్జిన్ టీకాకు అనుమతిపై ఈ రోజు కీలక ప్రకటన చేసింది.

కొవాగ్జిన్ టీకాకు డబ్ల్యూహెచ్‌వో 24 గంటల్లోనే అత్యవసర వినియోగానికి సిఫారసు చేయవచ్చునని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. భారత్ బయోటెక్ సమర్పించిన డేటాపై సాంకేతిక కమిటీ సమీక్ష నిర్వహిస్తున్నదని వివరించారు. జెనీవాలోని యూఎన్ ప్రెస్ బ్రీఫింగ్‌లో విలేకరులతో మార్గరెట్ హారిస్ ఈ విషయాన్ని తెలిపారు.

‘అవసరమైన విషయాలన్నీ ఉంటే.. అన్నీ అనుకున్నట్టు జరిగే, భారత్ బయోటెక్ సమర్పించిన డేటాపై కమిటీ సంతృప్తి చెందితే వచ్చే 24 గంటల్లోనే కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి సిఫారసు చేయవచ్చు’ అని వివరించారు.

Also Read: గుడ్‌న్యూస్: 18‌ ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్, కోవాగ్జిన్‌కి గ్రీన్‌సిగ్నల్

టీకా ప్రభావవంతమైనదని, సురక్షితమైనదే కీలక విషయాలను కఠిన పద్ధతిలో మదించాల్సి ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో ఇది వరకే వెల్లడించింది. కొవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతుల జాప్యంపై అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ విషయాన్ని తెలిపింది. 

డబ్ల్యూహెచ్‌వో అనుమతుల కోసం భారత్ బయోటెక్ ఏప్రిల్ 19నే దరఖాస్తు చేసింది. కానీ, ఈ అనుమతులు ఇవ్వడానికి ముందు డబ్ల్యూహెచ్‌వో మరింత సమాచారాన్ని సమర్పించాల్సిందిగా భారత్ బయోటెక్‌ను కోరింది. ఈ డేటానూ భారత్ బయోటెక్ సమర్పించింది.

click me!