
భారతదేశ చరిత్రలో మాయని మచ్చగా నిలిచిన 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి గురువారం మరో కీలక తీర్పు వచ్చింది. మైనారిటీ వర్గానికి చెందిన 11 మందిని హత్య చేసిన నరోదాగామ్ ఊచకోత కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మాయా కొద్నానీ, మాజీ బజరంగ్ దళ్ నేత బాబు బజరంగి, విశ్వహిందూ పరిషత్ నేత జయదీప్ పటేల్ సహా మొత్తం 69 మంది నిందితులను అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ప్రత్యేక న్యాయమూర్తి శుభదా బాక్సీ సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తుది తీర్పును ప్రకటించారు. ఆ వెంటనే నిందితుల బంధువులు జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.
గోద్రా ఘటన తర్వాత అహ్మాదాబాద్ నగరానికి సమీపంలో వున్న నరోడా గ్రామంలో జరిగిన హింసాకాండలో 11 మంది సజీవ దహనమయ్యారు. ఈ కేసుతో ప్రమేయం వున్న వారిని పోలీసులు దశలవారీగా అరెస్ట్ చేశారు. దాదాపు 21 ఏళ్లపాటు సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం న్యాయస్థానం తుదితీర్పును వెలువరించింది. ఈ కేసులో 187 మంది సాక్షుల వాంగ్మూలాలను తీసుకున్నారు. ఊచకోత జరిగిన రోజున 28 మంది, ఆ తర్వాత మరో 58 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 86 మంది నిందితుల్లో 14 మంది విచారణ దశలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసును విచారణను సుప్రీంకోర్టు నేరుగా పర్యవేక్షించింది.