
Karnataka Election 2023: నిజాయితీపరులంటే ప్రధాని నరేంద్ర మోడీకి భయమనీ, కర్నాటకలో అవినీతి రెట్టింపు స్థాయిలో పెరిగిపోయిందనీ, దీనికి ప్రధాన కారణం డబుల్ ఇంజిన్ సర్కారు కారణమంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ డబుల్ ఇంజిన్ పాలనలో కర్నాటకలో అవినీతి 20 శాతం నుంచి 40 శాతనికి పెరిగిపోయిందని ఆరోపించారు.
వివరాల్లోకెళ్తే.. కర్నాటక అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగున్నాయి. ఈ క్రమంలోనే అన్ని ప్రధాన పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ సైతం ఈ సారి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించింది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. శనివారం నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కర్నాటకలో పర్యటించారు. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దావణగెరెలో జరిగిన బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. నిజాయితీపరులను చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారని ఆయన అన్నారు.
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి తన ప్రసంగంలో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రస్తావించారనీ, అయితే తాము ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదని తెలిపారు. అయినప్పటికీ ప్రధాని మోడీ భయపడుతున్నారనీ, నిజాయితీపరులకు దూరంగా ఉండాలని అంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. తమ పార్టీపై వస్తున్న అవినీతి ఆరోపణలను కేజ్రీవాల్ ఖండించారు. అవినీతిపై తమ పార్టీ జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందన్నారు. అయితే, తమ పార్టీ పాలిత పంజాబ్ లో ఒక మంత్రిని, ఒక ఎమ్మెల్యేను అరెస్టు చేసి జైలుకు పంపారని కేజ్రీవాల్ ఆరోపించారు. తాము చాలా నిజాయితీగా ఉన్నామని ఆయన అన్నారు. కర్ణాటకకు అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తామనీ, ఉచిత విద్యుత్, మంచి ప్రభుత్వ పాఠశాలలను నిర్మించి నాణ్యమైన విద్యను అందిస్తామని తెలిపారు.
కర్నాటకలో బీజేపీ ప్రభుత్వ డబుల్ ఇంజిన్ పాలనతో అవినీతి రెట్టింపు స్థాయికి చేరుకుందని ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటకలో 20 శాతం కమీషన్ ప్రభుత్వం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. "ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ కర్ణాటకకు వచ్చి 20 శాతం కమిషన్ ప్రభుత్వం పాలన సాగుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడితే అవినీతిని అంతం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ వారు అవినీతిని మరింతగా పెంచి పోషించారు" అంటూ మండిపడ్డారు. ప్రధాని మోడీ మాటలను ప్రజలు నమ్మి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని (కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం) ఏర్పాటు చేస్తే.. రాష్ట్రంలో అవినీతి 20 శాతం నుంచి 40 శాతానికి రెట్టింపు అయిందని కేజ్రీవాల్ ఆరోపించారు. తాను దేశమంతా పర్యటిస్తాననీ, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొద్దని అందరికీ చెబుతానని పేర్కొన్నారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో అవినీతి రెట్టింపు అయిందనీ బీజేపీని టార్గెట్ చేసిన కేజ్రీవాల్.. కర్నాటకలో కొత్త ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.