
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్.. గౌతమ్ అదానీకి మద్దతుగా నిలిచారు. గౌతమ్ అదానీకి వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తీవ్ర ఆరోపణలతో విడుదల చేసిన రిపోర్టును ఆయన తోసిపుచ్చారు. ఆరోపణలు ఎవరైనా చేయొచ్చని, అవి చేయడం సులువని అన్నారు. అవి ఆరోపణలు మాత్రమేనని, నిజాలు కావు కదా అని పేర్కొన్నారు.
‘ఆరోపణలు చేయడం సులువు. ఆరోపణలు చేసినంత మాత్రానా అవన్నీ నిజాలనేమీ కాదు కదా. నేను నమ్మే సూత్రం ఏమిటంటే.. నిజానిజాలు తెలిసే వరకూ నిందితుడు అమాయకుడనే భావిస్తాను’ అని ఎన్డీటీవీతో మాట్లాడుతూ అబాట్ తెలిపారు.
‘ ఆ రిపోర్టులో పేర్కొన్నట్టుగా ఏదైనా విషయం ఉండి ఉంటే వాటిని రెగ్యులేటర్లు చూసుకుంటాయి. అవే నిజాలేమిటో చెబుతాయి కదా. కానీ, నా వరకు ఆస్ట్రేలియాపై అదానీ పెట్టుకున్న విశ్వాసానికి కృతజ్ఞుడిగా ఉంటాను’ అని పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాలో గౌతమ్ అదానీ బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టారని, వాటి ద్వారా ఎంతో మంది ఆస్ట్రేలియన్లు ఉపాధి పొందారని వివరించారు. ఆయన మార్కెట్ డీలింగ్స్‌లో ఏదేదో చేశారని ఆరోపణలు వచ్చాయని, వాటన్నింటినీ రెగ్యులేటరీలు చూసుకుంటాయని అన్నారు. గౌతమ్ అదానీ కంపెనీ చట్ట ప్రకారం నడుచుకుంటుందని, భారత దేశం కూడా చట్టబద్ధ పాలనతో నడుస్తున్నదని తాను నమ్ముతానని వివరించారు.
అదే సందర్భంలో ఆయన భారత ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ప్రస్తావించారు. భారత ప్రజలకు 24 గంటలు విద్యుత్ అందించాలనే నరేంద్ర మోడీ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా గౌతమ్ అదానీ కంపెనీ నడుచుకుందని, ఆస్ట్రేలియా నుంచి ఎలాంటి టారిఫ్‌లు లేకుండా గౌతమ్ అదానీ బొగ్గును ఇండియాకు దిగుమతి చేసుకున్నారని, తద్వారా భారతీయులకు నిత్యం విద్యుత్ అందించవచ్చని వివరించారు. నేడు విద్యుత్ లేకుండా ఆధునిక జీవితం సాధ్యం కాదని అన్నారు.