కరోనా కాటు: కేసుల్లో చైనాను దాటేసిన భారత్, టాప్ 10 కి అడుగు దూరంలో....

By Sree s  |  First Published May 16, 2020, 6:51 AM IST

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. నిన్నటివరకు మనదేశంలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్యా 85 వేలను దాటింది. 85,215 కేసులతో మనం ఇప్పుడు కరోనా వైరస్ కేసుల్లో దాని పుట్టినిల్లు చైనాను దాటేశాము.


భారతదేశంలో కరోనా వైరస్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. నిన్నటివరకు మనదేశంలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 85 వేలను దాటింది. 85,215 కేసులతో మనం ఇప్పుడు కరోనా వైరస్ కేసుల్లో దాని పుట్టినిల్లు చైనాను దాటేశాము. 

ఇక్కడ ఒక్క ఉపశమనం కలిగించే వార్త ఏమిటంటే... భారతదేశంలో మరణాల రేటు చైనాతో పోలిస్తే తక్కువగా ఉంది. చైనాలో మరణాల రేటు 5.5 శాతం గా ఉండగా భారతదేశంలో మాత్రం అది 3.2 శాతంగా ఉంది. 

Latest Videos

undefined

ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 44 లక్షల మంది  ఈ మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో అత్యధిక మంది అమెరికాకు చెందినవారే అవడం గమనార్హం. రష్యా, బ్రిటన్, స్పెయిన్ ఆ తరువాతి రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 3లక్షల పైచిలుకు మంది మరణించారు. 

ఇక రేపటితో మూడవదఫా విధించిన లాక్ డౌన్ గడువు కూడా భారతదేశంలో ముగుస్తుంది. ఆర్థికంగా జరుగుతున్న నష్టం, ఈ కరోనా వైరస్ వల్ల కలిగే నష్టం కన్నా ఎక్కువగా ఉండడంతో లాక్ డౌన్ కి మరిన్ని సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. 

ఇదిలా ఉంటే... తెలంగాణలో శుక్రవారం కొత్తగా 40 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ 19 కేసుల సంఖ్య 1,454కు చేరుకుంది. ఇప్పటి వరకు 34 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోగా.. ఇవాళ కొత్తగా 13 మంది డిశ్చార్జ్ అవ్వడంతో, కోలుకున్న వారి సంఖ్య 959కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 461 యాక్టివ్ కేసులున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధిలో 33, ఏడుగురు వలస కూలీలకు కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. 

ఓ వైపు లాక్ డౌన్ సడలింపులు.. మరో వైపు అంతకంతకూ పెరుగుతున్న కేసులతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

ప్రభుత్వ ఆదేశాలతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రధానంగా జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఒక్కో ఏఎన్‌ఎంకు.. వంద ఇళ్లు కేటాయించారు.

మూడు, నాలుగు రోజుల్లో పరీక్షలు నిర్వహించాలని వీరికి ఆదేశాలు అందాయి. తెలంగాణ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం వల్ల వలస కూలీలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరుకోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు కరోనా వ్యాప్తిపై ఇవాళ్టీ నుంచి దేశంలో ఐసీఎంఆర్ సర్వే నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత కలిగిన 60 జిల్లాల్లో ఈ సర్వే జరగనుంది. ఐసీఎంఆర్ సర్వే చేసే జిల్లాల్లో, తెలంగాణకు చెందిన జనగాం, నల్గొండ, కామారెడ్డి జిల్లాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ ప్రాంతాల్లో సామాజిక స్థాయికి కరోనా వ్యాప్తి జరిగిందా..? అనే కోణంలో ఈ సర్వే జరగనుంది.

click me!