ఏప్రిల్ 20 తర్వాత ఢిల్లీలో సడలింపులు ఉండవు: తేల్చేసిన కేజ్రీవాల్

By Siva KodatiFirst Published Apr 19, 2020, 2:35 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 20 తర్వాత ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతున్నందున లాక్‌డౌన్ యథాతథంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. 

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే వివిధ రంగాలకు తీవ్ర నష్టాలు వస్తుండగా, రెక్కాడితే కానీ డొక్కాడని వారి పరిస్ధితి మరింత దారుణంగా తయారైంది.

ఈ క్రమంలో ఈ నెల 20 తర్వాత కొన్ని రంగాలకు మినహాయింపులు ఇవ్వాలని ప్రధాని రాష్ట్రాలకు సూచించారు. అయితే దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 20 తర్వాత ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: పెళ్లిని వాయిదా వేసుకొన్న మహిళా డిఎస్పీ

ఢిల్లీలో కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతున్నందున లాక్‌డౌన్ యథాతథంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. వారం తర్వాత పరిస్ధితిని సమీక్షించి సడలింపులపై నిర్ణయం తీసుకుంటామని కేజ్రీవాల్ తెలిపారు.

ఢిల్లీని సురక్షిత ప్రాంతంగా ఉంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. రోజురోజుకీ వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో కంటైన్‌మెంట్ జోన్లను పెంచాల్సి వచ్చిందని వివరించారు.

అయితే, పరిస్ధితి మాత్రం అదుపులోనే ఉందని.. లక్షణాలు బయటపడకుండా, కోవిడ్ 19తో బాధపడుతున్న సంఘటనలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయని కేజ్రీవాల్ చెప్పారు. మర్కజ్ ఘటనల వల్లే ఢిల్లీలో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

దేశంలో నమోదైన కోవిడ్ 19 కేసుల్లో 12 శాతం ఢిల్లీలోనే ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతానికి ఢిల్లీలో 77 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయని, అలాగే అన్ని జిల్లాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించామని సీఎం వెల్లడించారు.

Also Read:దేశంలో ఆగని కరోనా విజృంభణ: 15 వేలు దాటిన కేసులు, 500 దాటిన మరణాలు

శనివారం 736 మందికి పరీక్షలు నిర్వహించగా... వారిలో 186 మందికి పాజిటివ్‌గా తేలిందన్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న భోజనశాలలో పనిచేస్తున్న ఒక వ్యక్తికి కరోనా సోకిందని... అతని ద్వారా ఎంతమందికి ఇది వ్యాప్తి చెందిందో అంచనా వేయడం కష్టమని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.

అక్కడ ఆహారాన్ని తిన్న వారందరినీ వీలైనంత త్వరగా గుర్తించి పరీక్షలు చేయాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఢిల్లీలో 1,893 కేసులు నమోదవ్వగా.. వీరిలో 42 మంది మృత్యువాతపడగా, మరో 72 మంది కోలుకున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. 

click me!