Covid-19: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర టాప్ లో ఉంది. ఆ తర్వాతి స్థానంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ లు ఉన్నాయి.
Coronavirus: భారత్ లో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కోవిడ్-19 ఫోర్త్ వేవ్ ఆందోళనలు అధికం అవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,688 మంది కరోనా వైరస్ మహమ్మారి బారినపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,75,864 కు పెరిగింది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టికే కేసులు.. వారం రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. కొత్తగా దేశంలో 50 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,23,803 కు పెరిగింది.
ప్రభుత్వ డేటా ప్రకారం.. భారతదేశంలో ప్రస్తుతం 18,684 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇవి మొత్తం కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లలో 0.04 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో 883 యాక్టివ్ కేసులు పెరగగా, శుక్రవారం 2,755 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తంగా ఇప్పటివరకు 4,25,33,377 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.74 శాతానికి పెరింగింది. 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.74 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని ప్రభుత్వ డేటా పేర్కొంది.కాగా, దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర టాప్ ఉంది. ఆ తర్వాతి స్థానంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ లు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 1607 కేసులు ఢిల్లీలోనే వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తున్నది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వెగవంతం చేయాలని అధికారులకు ఆదేశించింది. కరోనా మార్గదర్శకాలు సైతం పాటించాలని ప్రజలకు సూచిస్తోంది. ఇప్పటివరకు 1,88,89,90,935 వ్యాక్సిన్ డోసులు పంపినీ చేశామని, ఇందులో నిన్న ఒక్కరోజే 22,58,059 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపింది. ఇందులో మొదటి డోసుల సంఖ్య 91.4 కోట్లు ఉండగా, రెండు డోసుల తీసుకున్నవారి సంఖ్య 81.1 కోట్లుగా ఉంది. దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కరోనా మార్గదర్శకాలను పాటించాలని ప్రజలకు సూచిస్తున్నాయి. మాస్కులను తప్పనిసరి చేస్తూ నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో కోవిడ్-19 ప్రభావం పెరుగుతున్నదని ప్రస్తుతం నమోదవుతున్న కేసుల గణాంకాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్లు క్రమంగా పెరగడం.. కొత్త ఒమిక్రాన్ వేరియంట్‌లను జన్యు శాస్త్రవేత్తలు వేగంగా గుర్తించడం కోవిడ్ మహమ్మారి ఇంకా ముగియలేదనడానికి స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. చైనాలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.