కరోనా సోకి.. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో కరోనా రోగులకు చికిత్స చేయాల్సిన ఆస్పత్రుల గేటుకి తాళం వేశారు.
కరోనా మహమ్మారి ప్రపంచమంతటా విలయ తాండవం చేస్తోంది. చైనాలోని వుహాన్ లో గతేడాది మొదలైన ఈ వైరస్ ఇప్పుడు మన దేశంలోనూ మృత్యు ఘోష వినిపిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. కరోనా సోకి.. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో కరోనా రోగులకు చికిత్స చేయాల్సిన ఆస్పత్రుల గేటుకి తాళం వేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలోని ఉత్రరప్రదేశ్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రి ముందు 69 మంది కరోనా వైరస్ బాధితులు చేరుకున్నారు. కానీ ఆ ఆసుపత్రికి గేటుకు తాళం వేయటంతో వైరస్ బాధితులు గేటు ముందే కూర్చున్నారు. ఆగ్రా నుంచి 69 మంది కరోనా వైరస్ బాధితులు ఎటావా జిల్లా సైఫాయిలోని ఉన్న యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రికి బదిలీ చేశారు.
దీంతో సుమారు 116 కిలో మీటర్లు బస్‌లో ప్రయాణం చేసిన బాధితులు ప్రభుత్వ కళాశాల ఆసుపత్రికి గురువారం ఉదయం చేరుకున్నారు. అప్పటి ఆ ఆసుపత్రి గేట్లకు తాళం వేసి ఉండటంతో వైరస్ బాధితులు ఏం చేయాలో తోచక ఆసుపత్రి బయట ఉన్న ఫుట్‌పాత్ మీద సుమారు గంట పాటు వేచి ఉన్నారు.
దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌కాగా.. ఆ ప్రాంత పోలీసు అధికారి చంద్రపాల్ సింగ్ స్పందిస్తూ.. ‘మీరు చుట్టుపక్కల తిరగకుండా ఓకే చోట ఉండాలి. ఒక వైద్య బృందం త్వరలో మీ వద్దకు చేరుకుంటుంది. వైరస్ బాధితుల జాబితా తయరు చేసి మిమ్మల్ని ఆసుపత్రి లోపలికి తీసుకువెళ్లుతుంది. సరైనా సమాచారం లేకపోవటం వల్ల ఇలా జరిగింది’ అని ఆయన ఓ వీడియోలో పేర్కొన్నారు.