కొత్త వేరియంట్‌తో కరోనా వైరస్ భయాలు మరోసారి ఆవహిస్తున్నాయి. కేరళ, గోవా, మహారాష్ట్రతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదు కావడంతో ఆందోళనలు నెలకొంటున్నాయి. రోజు రోజుకూ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా కొత్తగా 752 కేసులు దేశంలో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రితం రోజు కంటే ఇవి రెట్టింపునకు మించి ఉన్నాయి.
Corona Cases: కరోనా మహమ్మారి ప్రపంచమంతా వణికించి కొంత వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి పంజా వేయడానికి చూస్తున్నది. ఈ మహమ్మారి అంత సులువుగా అంతం కాబోదని, ఇది శాశ్వతంగా మనతోనే ఉండిపోతుందని, దాని శక్తి తగ్గేవరకు రూపాంతరాలు చెంది సాధారణ జలుబుగా మారిపోతుందని అప్పుడే విశ్లేషణలు వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేసేలా మరోసారి కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తున్నది. రోజు రోజుకు కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. నిన్నటి కంటే నేడు రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 752 కరోనా కేసులు(కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకారం) రిపోర్ట్ అయ్యాయి. ఇవి క్రితం రోజుతో పోల్చితే రెట్టింపు కంటే అధికం కావడం గమనార్హం. గత ఏడు నెలల్లో అత్యధిక కేసులు కూడా. దీంతో మొత్తంగా ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 3,420కు పెరిగాయి. అంతేకాదు, నలుగురు రోగులు కూడా ఈ వైరస్ కారణంగా మారణించారు. తొమ్మిది రోజుల్లోనే దేశంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.
Also Read: గుడ్ న్యూస్.. 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు.. !
క్రితం రోజు దేశవ్యాప్తంగా 328 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక మరణం కూడా చోటుచేసుకుంది. ఇందులో 265 కేసులు కేవలం కేరళ నుంచే రిపోర్ట్ అయ్యాయి. ఆ ఒక్క మరణం కూడా ఈ రాష్ట్రంలో చోటుచేసుకున్నదే కావడం గమనార్హం. కొత్తగా నమోదైన 752 కేసుల్లో 565 కొత్త కేసులు ఈ రాష్ట్రంలో నమోదైనవే. ఈ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2872గా ఉన్నది.
కొత్త వేరియంట్ ఇప్పుడు అందరినీ వణికిస్తున్నది. కేరళతోపాటు మహారాష్ట్ర, గోవా, తెలుగు రాష్ట్రాల్లోనూ కలవరం పుట్టిస్తున్నది.