కేంద్ర ప్రభుత్వానికి లీగల్ నోటీసులు పంపిన కాంగ్రెస్ పార్టీ.. ఎందుకో తెలుసా?

Published : Jun 15, 2022, 05:32 PM IST
కేంద్ర ప్రభుత్వానికి లీగల్ నోటీసులు పంపిన కాంగ్రెస్ పార్టీ.. ఎందుకో తెలుసా?

సారాంశం

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో రాహుల్ గాంధీ దాటవేత ధోరణిలో సమాధానాలు ఇచ్చారని, న్యాయవాదులు చెప్పినట్టుగానే రాహుల్ గాంధీ అప్పజెబుతున్నట్టు ఉన్నదని కొన్ని కథనాలు వచ్చాయి. ఇవి కేంద్రం ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పుడు లీకులు అని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లీగల్ నోటీసులు పంపింది.

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాహుల్ గాంధీని మూడో రోజూ ఇంకా విచారిస్తూనే ఉన్నది. అయితే, తొలి రోజు విచారణ ముగియగానే కొన్ని మీడియాలో ఈడీ ప్రశ్నలు, రాహుల్ గాంధీ సమాధానాలకు సంబంధించి కొన్ని కథనాలు వచ్చాయి. ఈడీ వేసిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ సరిగ్గా సమాధానాలు చెప్పలేదని అవి పేర్కొన్నాయి. చాలా ప్రశ్నలకు దాటవేత ధోరణిలో సమాధానాలు చెప్పారని ఆ కథనాలు వివరించాయి. అంతేకాదు, రాహుల్ గాంధీ పాఠం అప్పగించినట్టుగా సమాధానాలు చెప్పారని, ఆయన న్యాయవాదులు చెప్పిన మేరకే ఆయన సమాధానాలు చెప్పారని ఆ కథనాల సారాంశం. ఈ కథనాలను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంది. ఏకంగా కేంద్రానికే లీగల్ నోటీసులు పంపింది.

కేంద్ర ప్రభుత్వం కావాలనే మీడియాకు కొన్ని తప్పుడు లీకులు ఇస్తున్నదని, ఆ లీకుల ఆధారంగా మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రచురించాయని కాంగ్రెస్ తన లీగల్ నోటీసులో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ మూడు మీడియా చానెళ్ల కథనాలను ఇందుకు ఆధారంగా తీసుకుంది. ఆ కథనాలు పేరు చెప్పని వర్గాలుగా పేర్కొంటూ రాహుల్ గాంధీపై తప్పుగా కథనాలు రాశాయని పేర్కొంది. 

ఈ నోటీసులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల్ సీతారామన్‌కు కాంగ్రెస్ పార్టీ పంపింది. రాజకీయ కుట్రల కోసం ఈడీని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించింది. ప్రభుత్వం తన కుట్ర ఎజెండాను మరింత విస్తరిస్తూ.. ఈడీ విచారణలో రాహుల్ సమాధానల తీరుపై తప్పుడు లీకులు మీడియాకు ఇచ్చిందని పేర్కొంది.

ఈ మేరకు తన లీగల్ నోటీసులు సుప్రీంకోర్టు ఉఠంకింపులనూ ప్రస్తావించింది. ఒక కేసులో దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే మీడియాకు లీక్ చేయరాదని, ఇది చట్టానికి ఒక శాపంగా మారుతుందని సుప్రీంకోర్టు గతంలో పేర్కొందని గుర్తు చేసింది. ఇలా లీక్ చేయడం అంటే.. సదరు ఏజెన్సీ తన చివరి ప్రయత్నంగా చేసే దుష్ప్రచారమనే అనిపిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొన్నట్టు తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు