
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక వచ్చే నెల 18న జరగనుంది. ఇందుకోసం అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు తమ అభ్యర్థి ఎంపిక కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందరి ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంపిక చేయాలనే ప్రయత్నాల్లో ఇరుపక్షాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి అభ్యర్థిపై అన్ని పార్టీల నుంచి అంటే ఎన్డీఏ, యూపీఏ. యూపీఏయేతర పక్షాలను కూడా రాష్ట్రపతి అభ్యర్థిపై ఆమోదాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నది.ఇందుకోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు అప్పగించింది. ఆ పార్టీ తాజాగా, కాంగ్రెస్ నేతనూ సంప్రదించి రాష్ట్రపతి అభ్యర్థిపై ఒపీనియన్ అడిగినట్టు సమాచారం వచ్చింది. కాగా, ప్రతిపక్షాలు అన్ని కలిసి ఒకే అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఈ రోజు ప్రతిపక్షాలతో ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషనల్ క్లబ్‌లో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశానికి ఆప్, టీఆర్ఎస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు హాజరు కాలేవు. కాంగ్రెస్ ఉన్నదనే కారణాన్ని చెప్పి టీఆర్ఎస్, శిరోమణి అకాలీదళ్‌లు భేటీకి దూరంగా ఉన్నాయి. కాగా, బీజేడీ, వైసీపీలకు టీఎంసీ ఆహ్వానం కూడా పంపలేదు.
ప్రతిపక్షాల అభ్యర్థిగా శరద్ పవార్ ఉంటారని కథనాలు రాగానే.. ఆయన తాను రాష్ట్రపతి అభ్యర్థి రేసులో లేరని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఢిల్లీకి వచ్చీరాగానే శరద్ పవార్ నివాసానికి వెళ్లారు. రెండు లెఫ్ట్ పార్టీలు కూడా శరద్ పవార్‌ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ససేమిరా అన్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలు మహాత్మా గాంధీ మనవడు గోపాల్ క్రిష్ణ గాంధీని పరిగణనలోకి తీసుకున్నట్టు న్యూస్ 18 కథనం తెలిపింది. పలువురు ప్రతిపక్ష నేతలు ఆయనకు ఫోన్ చేసి ఈ విషయమై ఆరా తీశారని పేర్కొంది. ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా నిలబడాలని కోరినట్టు వివరించింది. కానీ, గోపాల్ క్రిష్ణ గాంధీ ఈ ప్రతిపాదనపై ఆలోచిస్తానని, తనకు కొంత సమయం కావాలని కోరినట్టు తెలిపింది. బుధవారం తాను తన అభిప్రాయాన్ని చెబుతానని సమాధానం ఇచ్చినట్టు కొన్ని వర్గాలు తెలిపాయని ఆ కథనం వివరించింది.
గోపాల్ క్రిష్ణ గాంధీ 2004 నుంచి 2009 మధ్య పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా చేశారు. ఆయన 2017లోనూ ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రేసులోకి దిగాడు. కానీ, వెంకయ్యనాయుడు గెలిచారు.
కాగా, ప్రతిపక్షాలు గోపాల్ క్రిష్ణ గాంధీతోపాటు మరికొందరి పేర్లనూ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అయితే, వారి అభిప్రాయాలు, సమ్మతం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
కాగా, ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో మమతా బెనర్జీ ప్రతిపక్షాల తో తలపెట్టిన సమావేశం ప్రారంభమైంది. ఇందులో కాంగ్రెస్ తరఫున రణదీప్ సుర్జేవాలా, జైరాం రమేశ్, మల్లికార్జున్ ఖర్గేలు, శివసేన తరఫున ప్రియాంక చతుర్వేది, ఆర్ఎస్‌పీ నేత ఎన్‌కే ప్రేమచంద్రన్, ఆర్జేడీ నేత మనోజ్ ఝా, సీపీఎం లీడర్ ఎలమారం కరీం, ఎన్‌సీ నేత ఒమర్ అబ్దుల్లాతో పాటు పలువురు హాజరయ్యారు.