
తమిళనాడుతో తనకు ఎంతో అనుబంధం వుందన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. మంగళవారం కన్యాకుమారి వద్ద ‘‘భారత్ జోడో యాత్ర’’ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. యాత్రకు ఆరంభంలో ఇక్కడి సముద్రం, ఆహ్లాదకర వాతావరణం జోష్ నింపుతోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా ఏదో లోటు వుందని ప్రజలు భావిస్తున్నారని రాహుల్ అన్నారు. సగర్వంగా తలెత్తుకుని వున్న ఇక్కడి జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు.
జాతీయ జెండా అంటే కేవలం మూడు రంగులు కాదని ... ప్రతీ భారతీయుడి స్వేచ్ఛకు ఇది ప్రతీక అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జాతీయ జెండా అన్ని రాష్ట్రాల సమైక్యతకు చిహ్నమని.. భారత్ అంటే సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అన్ని వ్యవస్థలపై దాడులు చేస్తోందని.. సీబీఐ, ఈడీలను విపక్షాలపై అస్త్రాలుగా వాడుతున్నారని ఆరోపించారు. ఇటువంటి దాడులకు భయపడమని రాహుల్ తేల్చిచెప్పారు. మతచిచ్చు పెట్టి దేశాన్ని విభజించాలని బీజేపీ భావిస్తోందని.. భారత్ ఇప్పుడు అత్యంత దుర్భర ఆర్ధిక సంక్షోభాన్ని చూస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ALso Read:భారత్ జోడో యాత్ర: కన్యాకుమారిలో ప్రారంభించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
మీడియాను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని.. మీడియాలో ఎక్కడా ధరల పెరుగుదల, ఆర్ధిక సంక్షోభంపై వార్తలు రావని రాహుల్ గాంధీ మండిపడ్డారు. అంతా మోడీ భజనేనని.. ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయకుండా అమ్మేస్తున్నారని ఆయన ఆరోపించారు. మీడియాను నియంత్రణలో పెట్టుకుని 24 గంటలూ మోడీనే దర్శనమిస్తున్నారని.. మత రాజకీయాలతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. రెండు మూడు కార్పోరేట్ సంస్థలు దేశాన్ని నియంత్రిస్తున్నాయని... జీఎస్టీ, పన్నుల భారంతో రైతులు, సామాన్యులు విలవిలలాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక యువత నిరుత్సాహంలో వున్నారని.. దేశంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడం అసాధ్యం కాదన్నారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే భారత్ జోడో యాత్ర ఉద్దేశమని రాహుల్ స్పష్టం చేశారు.