
న్యూడిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలపై ప్రతిపక్ష పార్టీల నేతల నుంచి కీలక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవలే బిహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లు ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ వీలైనంత త్వరగా ప్రతిపక్షాలను కూడగట్టాలని, అన్ని ప్రతిపక్షాలు కలిసి కట్టుగా ఎన్నికల్లో దిగితే బీజేపీ 100 సీట్లను దాటదని అన్నారు. తాజాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నాగాల్యాండ్‌లో మాట్లాడుతూ స్వరాన్ని మరికాస్త పెంచారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వమే వస్తుందని అన్నారు. 100 మంది నరేంద్ర మోడీలు, అమిత్ షాలు వచ్చినా సరే అని తెలిపారు.
ఎన్నికల రాష్ట్రం నాగాల్యాండ్‌లోని చుమైకేడిమాలో ఆయన మట్లాడారు. గత 20 ఏళ్లుగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రొగ్రెస్సివ్ పార్టీ, బీజేపీ దోచుకున్నాయని ఆరోపించారు. ఇక్కడి ప్రజలు న్యాయం పొందే సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు.
అలాగే 2024 ఎన్నికల గురించి కూడా ఆయన మాట్లాడారు. ‘మేం ఇతర పార్టీలతోనూ మాట్లాడుతున్నాం. లేదంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కనిపించకుండా పోయే ముప్పు ఉన్నది. కాబట్టి, మేం ప్రతి పార్టీని పిలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, మా అభిప్రాయాలు వినిపిస్తున్నాం. 2024 ఎన్నికలను ఎలా గెలువాలో మా ఆలోచనలు పంచుకుంటున్నాం.. బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ రాదు. అన్ని పార్టీలు కలిసి కట్టుగా పోటీ చేసి మెజార్టీ స్థానాలు గెలుచుకుంటాయి.. అఫ్‌కోర్స్ కాంగ్రెస్ పార్టీ వాటన్నింటికీ నాయకత్వం వహిస్తుంది. మేం రాజ్యాంగాన్ని పాటిస్తాం. ప్రజాస్వామ్యాన్ని ఆచరిస్తాం. వంద మంది మోడీలు, షాలు రానివ్వండీ.. ఇది భారత దేశం.. మన రాజ్యాంగం చాలా బలమైనది’ అని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
Also Read: మనుషుల పట్ల కనీస సానుభూతి చూపని రాక్షస ప్రభుత్వం ఇది: కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై రేవంత్
60 స్థానాలు గల నాగాల్యాండ్ అసెంబ్లీకి ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరుగుతున్నది. సింగిల్ ఫేజ్‌లోనే ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. మార్చి 2వ తేదనీ ఓట్ల లెక్కింపు ఉంటుంది.