
Prime Minister Narendra Modi: విమానయాన రంగం ప్రజలను మరింత దగ్గర చేస్తోందని, మరిన్ని విమానాశ్రయాలు, మెరుగైన కనెక్టివిటీతో జాతీయ పురోగతికి ఊతమిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఫిబ్రవరి 19 న దేశీయ విమాన ట్రాఫిక్ కోవిడ్ అనంతర కొత్త గరిష్ట స్థాయి 4.45 లక్షలకు చేరుకుందని పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేసిన ట్వీట్ ను ప్రధాని మోడీ పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "మరిన్ని విమానాశ్రయాలు, మెరుగైన కనెక్టివిటీ... విమానయాన రంగం ప్రజలను దగ్గర చేస్తోంది.. ఇది జాతీయ పురోగతిని పెంచుతోంది" అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
కరోనా వైరస్ మహమ్మారికి ముందు సగటు రోజువారీ దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 3,98,579గా ఉంది. కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. పరిస్థితులు మెరుగుపడ్డాక చాలా సమయం తర్వాత ఈ రంగంలో సానుకూల పరిస్థితులు ఏర్పాడ్డాయి. అయితే, కోవిడ్ తర్వాత దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకలు కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయని సింధియా సోమవారం ట్వీట్ చేశారు. దేశీయ విమానయాన సంస్థల ద్వారా ఆదివారం 4,44,845 మంది ప్రయాణికులు ప్రయాణించారు.
"ఇది ఒక మరో మైలురాయి! ఇండియన్ సివిల్ పెరుగుతూనే ఉంది!'' అని సింధియా పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశంలో 147 విమానాశ్రయాలు నడుస్తున్నాయి. ఈ నెల 27న కర్ణాటకలోని శివమొగ్గలో నూతనంగా నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా గణనీయంగా ప్రభావితమైన దేశ విమానయాన రంగం ప్రస్తుతం రికవరీ బాటలో పడిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.