పీఎఫ్ఐ పై ఎన్ఐఏ దాడుల గురించి రాహుల్ గాంధీ ఏమన్నాడంటే?

By Mahesh KFirst Published Sep 22, 2022, 4:17 PM IST
Highlights

ఎన్ఐఏ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పీఎఫ్ఐ పై ఏకకాలంలో దాడులు జరిపింది. ఈ దాడుల్లో సుమారు 106 మందిని అరెస్టు చేసింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు.
 

న్యూఢిల్లీ: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా  (పీఎఫ్ఐ) పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కనీవినీ ఎరుగని రీతిలో దాడులు జరిపింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రంలో ఏకకాలంలో ఎన్ఐఏ సారథ్యంలో పలు ఏజెన్సీలు పీఎఫ్ఐ కమిటీలు, కార్యాలయాలపై దాడులు చేశాయి. టెర్రర్ ఫండింగ్ ఆరోపణలపై ఈ దాడులు జరిపింది. గురువారం తెల్లవారుజామునే సుమారు 106 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేసింది. ఈ భారీ యాక్షన్‌పై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.

భారత్ జోడో యాత్రలో భాగంగా కేరళలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఇందులో ఓ విలేకరి పీఎఫ్ఐ పై ఎన్ఐఏ సారథ్యంలో జరుగుతున్న దాడుల గురించి ప్రశ్నించారు. ఈ దాడులపై ఆయన అభిప్రాయాన్ని కోరారు.

అన్ని రకాల మతోన్మాదాలతో పోరాడాలని, అది ఎక్కడి, ఏ వర్గం నుంచి వస్తున్నది అనే అంశాలకు అతీతంగా విద్వేషాన్ని, విభజనను తెచ్చే, హింసను రగిల్చే శక్తులతో పోరాడాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి అంశాల పట్ల ఉదారంగా వ్యవహరించరాదని తెలిపారు.

బుధవారం, గురువారాల మధ్య రాత్రి పూట ఎన్ఐఏ దేశవ్యాప్తంగా పలు చోట్ల ఏకకాలంలో రైడ్లు నిర్వహించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, 11 రాష్ట్రాల పోలీసు బలగాలతో ఎన్ఐఏ దాడులు చేసింది. కేరళ నుంచి 22 మందిని, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి 20 మంది చొప్పున, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు, అసోం నుంచి తొమ్మిది మంది, ఢిల్లీ నుంచి ముగ్గురు, మధ్యప్రదేశ్ నుంచి నలుగురు, పుదుచ్చేరి నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి పది మంది, ఉత్తరప్రదేశ్ నుంచి ఎనిమిది మంది, రాజస్తాన్ నుంచి ఇద్దరిని అరెస్టు చేసినట్టు తెలిసింది.

టెర్రర్ ఫండింగ్, ట్రైనింగ్ క్యాంపుల శిక్షణ, ప్రజలను ర్యాడికలైజ్ చేసి నిషేధిత సంస్థల్లోకి పంపిస్తున్నదనే ఆరోపణలతో పీఎఫ్ఐ పై ఈ దాడులు జరుగుతున్నాయి.

click me!