2024 ఎన్నికలు.. కాంగ్రెస్‌తో పొత్తుకు మమతా బెనర్జీ రెడీ.. మేమంతా కలిసి పోటీ చేస్తాం: శరద్ పవార్

By Mahesh KFirst Published Sep 22, 2022, 2:16 PM IST
Highlights

2024 ఎన్నికల కోసం ప్రతిపక్షాలు అన్నీ ఏకం అవుతాయని శరద్ పవార్ అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తుకు మమతా బెనర్జీ కూడా సిద్ధంగా ఉన్నారని వివరించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.

ముంబయి: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్రెసిడెంట్ శరద్ పవార్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం గత అనుభవాలను పక్కన పెట్టి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి మమతా బెనర్జీ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బుధవారం ముంబయిలో పత్రికా సమావేశంలో శరద్ పవార్ మాట్లాడారు.

గతంలో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడానికి  మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించిన విషయాన్ని విలేకరులు ఆయన ముందు ప్రస్తావించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీఎంసీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయా? అని అడిగారు. ఇందుకు సమాధానంగా గత అనుభవాలను పక్కన బెడతారని శరద్ పవార్ వివరించారు. జాతీయ ప్రయోజనాల కోసం గత అనుభవాలను పక్కన పెట్టడానికి మమతా బెనర్జీ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసిందని, దీని కారణంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బీజేపీకి లబ్ది చేకూరిందని ఆయన వివరించారు. జాతీయ ప్రయోజనాల కోసం ఆమె గతాన్ని వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రతిపక్ష కూటమి కోసం ఒక చోట చేరడానికి రెడీగా ఉన్నారని తెలిపారు.

నితీష్ కుమార్‌తో సమావేశం గురించీ విలేకరులు ప్రస్తావించారు. దీని గురించి మాట్లాడుతూ, నితీష్  కుమార్ తన ఆలోచనలను తెలియజేశాడని అన్నారు. ప్రస్తుతం దేశ పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఒక సంఘటిత ఏజెన్సీ అవసరం అని అందరమూ అంగీకరించామని చెప్పారు. ఇందుకోసం ఒక ప్రతిపక్ష ఐక్య కూటమి అవసరం అని పేర్కొన్నారు. ‘అది నితీష్ కుమార్ కానివ్వండి, ఫరూఖ్ అబ్దుల్లా కానివ్వండి, ఇతర సహచరులెవరైనా కానివ్వండి.. మేమంతా ఒక తాటి మీదికి వస్తాం’ అని చెప్పారు.

click me!