
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi Vadra) వాద్రా బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. తన కొడుకు రైహన్ (priyanka gandhi son Raihan) మెడికల్ చెకప్ కోసం అతనితో కలిసి ప్రియాంక గాంధీ నగరానికి వస్తున్నారు. రైహన్ కంటికి సంబంధించిన చికిత్స (eye treatment) కోసం ఆమె నవంబర్ 24న హైదరాబాద్ రానున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. నగరంలోని ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్‌లో రైహన్‌కు చికిత్స జరగనుంది. ఆస్పత్రిలో పని ముగించుకుని గురువారం సాయంత్రం ప్రియాంక గాంధీ తన కొడుకుతో కలిసి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఇక, గతంలో కూడా ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా.. రైహన్ కంటి చికిత్స కోసం హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.
కొన్నేళ్ల కిందట క్రికెట్ ఆడుతున్న సమయంలో రైహన్ కంటికి గాయమైంది. దీంతో రైహన్‌ను డిల్లీలోని ఎయిమ్స్‌లో (Delhi AIIMS) చేర్పించారు. అయితే ఎయిమ్స్ వైద్యులు.. రైహన్‌ను హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలోనే ప్రియాంక గాందీ దంపతులు.. నాలుగున్నరేళ్ల కిందట రైహన్‌ను తీసుకుని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి (LV Prasad Eye Institute) వచ్చారు. అక్కడ వైద్యులు రైహన్‌కు పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ మరోసారి రేపు నగరానికి రానున్నారు.
ఇక, ప్రియాంక గాంధీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఆమె భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రజానీకంపై హామీల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా అధికార బీజేపీపై, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ఆమె విమర్శల వర్షం కురిపిస్తున్నారు.