
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీ సహా బీజేపీ కీలక నేతలు అంతా కాంగ్రెస్ పై ఘాటుగా విరుచుకుపడతారు. కాంగ్రెస్ విముక్త భారత్ అని కూడా బీజేపీ నేతలు కొన్నిసార్లు తమ లక్ష్యంగా పేర్కొన్నారు. చాలా సార్లు కాంగ్రెస్ అసలు ఫీల్డ్‌లో లేనే లేదని, పోటీలో లేదని కూడా చాలా విమర్శలు చేశారు. తాజాగా, అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. తమ ప్రత్యర్థి కాంగ్రెస్సే అని వివరించారు. ఈ వ్యాఖ్యలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేశారు.
ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో త్రికోణ పోటీ నెలకొన్నట్టు కనిపిస్తున్నదని జర్నలిస్టు అన్నారు. త్రికోణ పోటీ నెలకొన్నప్పుడు ఫలితాలను అంచనా వేయలేం కదా? అని అడిగారు. ఇందుకు అలాంటిదేమీ లేదని అమిత్ షా పేర్కొన్నారు. ఎందుకు అంచనా వేయలేమని ప్రశ్నించారు. 1990ల నుంచి గుజరాత్ ప్రజలు ఏ ఎన్నికైనా బీజేపీనే గెలిపిస్తున్నారని, అయినా, రాష్ట్రంలో త్రికోణ పోటీ ఉన్నదో లేదో ఫలితాల రోజు వెల్లడి అవుతుందని వివరించారు.
Also Read: ఈసారి గుజరాత్ సీఎం ఆయనే ... అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
అలాగైతే.. గుజరాత్‌లో ఉనికి పెంచుకోవడానికి పరితపిస్తున్న ఆప్‌పై బీజేపీ ఎందుకు నేరుగా విరుచుకుపడుతున్నదని ప్రశ్నించగా.. బీజేపీ ఏ పార్టీపైనా విరుచుకుపడటం లేదని షా వివరించారు. అయితే, తమపై బహిరంగంగా ఆరోపణలు చేసినప్పుడు వాటిపై స్పష్టత ఇవ్వాల్సిన, వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉంటుందని తెలిపారు. ఎవరైనా తప్పుడు ఆరోపణలపై గెలవాలని భావిస్తే.. తమ అభివృద్ధి ఎజెండా నుంచి పక్కదారి పట్టించాలని చూస్తే స్పందించాల్సే ఉంటుందని అన్నారు. నిజానికి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రత్యర్థి కాంగ్రెస్సే అని వివరించారు.
కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి, గణపతి బొమ్మలు ఉండాలని ఆప్ చేసిన వాదన బీజేపీకి ఇబ్బందికరంగా మారిందా? అని జర్నలిస్టు అడిగారు. అలాంటిదేమీ లేదని, దానికి సమాధానం ప్రజలు డిసెంబర్ 8వ తేదీన వెల్లడిస్తారని వివరించారు. గుజరాత్‌లో 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నదని, రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిందని అన్నారు. వచ్చే పదేళ్ల కోసం కూడా రాష్ట్ర అభివృద్ధిపై తమకు రోడ్ మ్యాప్ ఉన్నదని ఆయన తెలిపారు. వేరే ఏ పార్టీని వ్యతిరేకించడానికి తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపాలని ప్రజలను తాము కోరుతున్నామని పేర్కొన్నారు. తద్వార రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ చేస్తామని అమిత్ షా చెప్పారు.
ఢిల్లీలో కొరకరాని కొయ్యగా మారిన ఆప్.. బీజేపీలోనూ పాగా వేసిన సంగతి తెలిసిందే. నిజానికి గుజరాత్‌లో కాంగ్రెస్ కంటే కూడా ఆప్ అగ్రెస్సివ్‌గా క్యాంపెయిన్ చేస్తున్నది. అక్కడ బీజేపీ.. ఆప్‌నే ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఈ తరుణంలో ఆప్‌కు ప్రాధాన్యత ఇవ్వరాదనే కోణంలోనే కాంగ్రెస్ తమ ప్రత్యర్థి అని అమిత్ షా అని ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.