Omicron Symptoms: ఇండియాలో ఐదుగురు ఒమిక్రాన్‌ పేషెంట్లలో ఉన్న లక్షణాలు ఇవే..

By team teluguFirst Published Dec 5, 2021, 4:38 PM IST
Highlights

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసి కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron).. ప్రపంచ దేశాలకు క్రమంగా విస్తరిస్తోంది. ఇండియాలో నమోదైన 5 ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో లక్షణాలను (Omicron Symptoms) వైద్యులు పరిశీలిస్తున్నారు.
 

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసి కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron).. ప్రపంచ దేశాలకు క్రమంగా విస్తరిస్తోంది. ఇండియాలో కూడా నెమ్మదిగా  కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి, తీవ్రత, లక్షణాలపై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు, నిపుణులు.. పరిశోధనలు జరుపుతున్నారు. అయితే ఇండియాలో నమోదైన 5 ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో లక్షణాలను (Omicron Symptoms) వైద్యులు పరిశీలించారు. ఐదుగురిలో కూడా తేలికపాటి లక్షణాలు ఉన్నట్టుగా నివేదికలు వెలువడ్డాయి. 

ఇండియాలో తొలుత కర్ణాటకలో ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ వేరియంట్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఇందులో ఒకరు దక్షిణాఫ్రికా దేశస్తుడు కాగా, మరోక స్థానిక ప్రభుత్వ వైద్యుడు. దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి ఇప్పటికే దేశం విడిచిపెట్టి వెళ్లగా.. అతనిలో ఎలాంటి లక్షణాలు లేవు. మరోవైపు స్థానిక డాక్టర్‌కు ఎలాంటి ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేదు. ఆ తర్వాత శనివారం ముంబైలో ఓ మెరైన్ ఇంజనీర్‌కు, గుజరాత్‌లో ఎన్‌ఆర్‌ఐకి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. అయితే వీరందరికి కూడా తేలికపాటి లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు నివేదించారు. 

ఇక, టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టుగా ఆదివారం నిర్దారణ అయింది. అయితే ఆ వ్యక్తిలో రోగికి గొంతు నొప్పి, బలహీనత (Weakness), ఒళ్లు నొప్పులు ఉన్నట్టుగా ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ వేరియంట్ సోకిన వారిలోని లక్షణాలు తీవ్రమైన అనారోగ్యానికి కారణం కాదని సూచిస్తున్నప్పటిక.. శాస్త్రవేత్తలు దాని వ్యాప్తిపై ఇంకా ఖచ్చితమైన అంచనాకు రాలేకపోతున్నారు.

డెల్టా వేరియంట్‌ మాదిరిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రుచి, వాసన గుర్తింపు కోల్పోవడం వంటి ప్రధాన లక్షణాలు ఒమిక్రాన్ వేరియంట్‌ రోగుల్లో లేవని వైద్యులు చెబుతున్నారు. కరోనా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌ బారి నుంచి కోలుకోవడం, వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్‌ వల్ల పెద్ద ముప్పు ఉండబోదని అంచనా వేస్తున్నారు. ఇప్పటికి ఈ వేరియంట్‌కు సంబంధించి మరణాలు నమోదు కాలేదని గుర్తుచేస్తున్నారు. 

Also read: Omicron Symptoms: ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఇవే.. ఆ ఏజ్ గ్రూప్‌ మీద ఎక్కువగా ప్రభావం..!

ఇక, తొలుత పేషెంట్లలో కొత్త వేరియంట్‌ను అనుమానించిన వారిలో ఒకరైన దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ (Dr. Angelique Coetzee) కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వేరియంట్ బారిన పడుతున్నవారిలో ఒకటి రెండు రోజులు తీవ్రమైన అలసట ఉంటుందని.. ఈ కారణంగా తలనొప్పి, ఒళ్లు నొప్పులు వస్తున్నయని తెలిపారు. ఈ వేరియంట్ బారినపడ్డ వారిలో వాసన లేదా రుచి కోల్పోయినట్లు నివేదించలేదని తెలిపారు. కొత్త వేరియంట్‌తో ఆక్సిజన్ స్థాయిలలో పెద్దగా తగ్గుదల లేదని చెప్పారు. 
 

click me!