మాక్ డ్రిల్.. అసలు అతను డ్రిల్ మాష్టరే కాదు.. ప్లాన్ ప్రకారం హత్య...?

First Published Jul 13, 2018, 2:50 PM IST
Highlights

 ఎన్‌డీఎంఏ ఆ కళాశాలలో అధికారికంగా ఎలాంటి మాక్‌ డ్రిల్‌ను నిర్వహించలేదు. ఆర్ముగం ఎన్‌డీఎంఏ అధికారికంగా గుర్తించిన శిక్షకుడు కాదు. మాక్‌ డ్రిల్‌ నిర్వహించమని అతడిని మేము పంపలేదు

మాక్ డ్రిల్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో చనిపోయిన విద్యార్థిని లోకేశ్వరి మరణం వెనుక షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఆ డ్రిల్ నిర్వహించి విద్యార్థి చావుకు కారణమైన వ్యక్తి అసలు డ్రిల్ మాష్టరే కాదట.

పూర్తి వివరాల్లోకి వెళితే..చెన్నైలోని కోవై కళైమగల్‌ కళాశాలలో ఎన్‌డీఎంఏ(నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ) మాక్‌ డ్రిల్‌ నిర్వహించిందని తనను ట్రైనర్‌గా పంపించారని చెప్పి ఆర్ముగం కళాశాలలోకి వెళ్లాడు. యాజమాన్యం కూడా అతను చెప్పిన మాటల్ని నమ్మి విద్యార్థులతో మాక్‌ డ్రిల్‌ చేయించింది.

ఈ విషయం గురించి తాజాగా ఎన్‌డీఎంఏ ట్విటర్‌ ద్వారా స్పందించింది. విద్యార్థిని మృతిపట్ల తాము చింతిస్తున్నట్లు తెలిపింది. అయితే ఆ కళాశాలలో నిర్వహించిన డ్రిల్‌కు, తమకూ ఎలాంటి సంబంధం లేదని అంటోంది. ‘మాక్‌ డ్రిల్‌ సమయంలో ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఆమె కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఎన్‌డీఎంఏ ఆ కళాశాలలో అధికారికంగా ఎలాంటి మాక్‌ డ్రిల్‌ను నిర్వహించలేదు. ఆర్ముగం ఎన్‌డీఎంఏ అధికారికంగా గుర్తించిన శిక్షకుడు కాదు. మాక్‌ డ్రిల్‌ నిర్వహించమని అతడిని మేము పంపలేదు’ అని వెల్లడించింది. దాంతో అసలు ఆర్ముగం ఎవరు? అన్న సందేహాలు మొదలవుతున్నాయి. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆర్ముగం ఫేస్‌బుక్‌ ఖాతాను పరిశీలించగా, తనని తాను ఎన్‌డీఎంఏ ట్రైనర్‌గా పేర్కొనడం గమనార్హం.

ఇదే కళాశాలలో బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్న లోకేశ్వరి అనే విద్యార్థిని రెండో అంతస్తు నుంచి దూకడానికి భయపడుతుండటంతో ఆర్ముగం ఆమెను కిందికి తోసేశాడు. దాంతో ఆ యువతి తల మొదటి అంతస్తు గోడ అంచుకు తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనను అక్కడి విద్యార్థులు కొందరు వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

click me!