
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నుంచి దేశం ఇంకా పూర్తిగా కోలుకోక ముందే పశ్చిమ బెంగాల్‌లో మరో రైలు ప్రమాద ఘటన వెలుగు చూసింది. ఖరగ్‌పూర్ స్టేషన్ సమీపంలో లోకల్ రైలు పట్టాలు తప్పింది. ప్రమాదం తర్వాత చుట్టుపక్కల అంతటా గందరగోళం నెలకొంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు చెప్పారు. అందిన సమాచారం ప్రకారం.. రైలు మేదినీపూర్-హౌరా లోకల్ రైలు స్టేషన్ నుండి బయలుదేరిన వెంటనే ఔటర్‌లోని స్తంభాన్ని ఢీకొట్టింది. దాని కొన్ని కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే.. దీనిపై అధికారికంగా సమాచారం లేదు.
రైలు ఒక్కసారిగా ఆగడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు పట్టాలు తప్పిన ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. స్థానికులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి లోకల్ రైలు మేదినీపూర్ నుంచి హౌరాకు వస్తోంది. రాత్రి 10.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
స్టేషన్ నుండి బయలుదేరిన తరువాత రైలు నెమ్మదిగా కదులుతుంది కాబట్టి పెద్ద ప్రమాదం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతామని సీపీఆర్వో తెలిపారు. ట్రాక్‌లో మరమ్మతు పనులు జరుగుతున్నట్లు ప్రాథమిక సమాచారం. తరచూ రైలు ప్రమాదాలు జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రైల్వేశాఖ అప్రమత్తమైన తమ భద్రతకు ప్రాధాన్యమివ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.