సీఏఏ ఆందోళనల్లో హింస, రాళ్లదాడి.. కానిస్టేబుల్ మృతి

By Siva KodatiFirst Published Feb 24, 2020, 5:45 PM IST
Highlights

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనల్లో మరోసారి హింస నెలకొంది. ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్, మౌజ్‌పుర్, గోలక్‌పురి, భజన్‌పురా ప్రాంతాల్లో సోమవారం సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు నిరసన నిర్వహించాయి.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనల్లో మరోసారి హింస నెలకొంది. ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్, మౌజ్‌పుర్, గోలక్‌పురి, భజన్‌పురా ప్రాంతాల్లో సోమవారం సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు నిరసన నిర్వహించాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో అది రాళ్ల దాడికి దారి తీసింది.

అక్కడితో ఆగకుండా పలు వాహనాలు, దుకాణాలు, ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీఛార్జీతో పాటు భాష్పవాయువును ప్రయోగించారు. ఆందోళన నేపథ్యంలో జఫ్రాబాద్, మౌజ్‌పూర్-బాబర్ పూర్ మెట్రో స్టేషన్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.

Also Read:సీఏఏ రగడ: ఢిల్లీలో రాళ్లు రువ్వుకున్న నిరసనకారులు, మెట్రో స్టేషన్ మూసివేత

వీరి దాడిలో అగ్నిమాపక శాఖకు చెందిన ఫైరింజన్ ధ్వంసమైంది. అల్లర్లను అదుపు చేసే క్రమంలో డిప్యూటీ పోలీస్ కమీషనర్ అమిత్ శర్మకు, రతన్ లాల్ అనే కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.

వీరిద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతూ రతన్ లాల్ కన్నుమూశారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో మరికొందరు పోలీసులకు సైతం గాయాలైనట్లుగా తెలుస్తోంది. 

Also Read:సీఏఏ నిరసన: 70 రోజుల నిరీక్షణ.. తెరచుకున్న షాహీన్‌బాగ్ రోడ్డు

ఆదివారం సైతం సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. జఫ్రాబాద్ ప్రాంతంలో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో తీవ్ర హింసాత్మక వాతావరణం చోటు చేసుకుంది.

ఇరు వర్గాల నిరసనలతో రోడ్లపై రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అంతటితో ఆగకుండా జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో అధికారులు స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీఛార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. 

click me!