కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు..

By Asianet NewsFirst Published May 16, 2023, 8:31 AM IST
Highlights

కర్ణాటకలో ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన ఘర్షణలో ఓ బీజేపీ కార్యకర్త మరణించారు. హోస్కోటే అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందటంలో ఆ పార్టీ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు చిన్న గొడవ జరిగింది. ఇది తీవ్ర వివాదంగా మారి ఒకరి ప్రాణాలను బలిగొంది. 

కర్ణాటకలోని బెంగళూరు జిల్లాలో టపాసులు పేల్చే విషయంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్య శనివారం ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని హోస్కోటే తాలూకాలో చోటుచేసుకుంది. మృతుడిని కృష్ణప్పగా గుర్తించారు. ఈ ఘర్షణలో తొలుత ఆయనకు గాయాలయ్యాయి. దీంతో చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించడంతో ఆయన మరణించాడు.

సీఎం పదవి ఇవ్వకపోయినా రెబల్ గా మారను, బ్లాక్ మెయిల్ చేయను : కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్

ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మే 13వ తేదీన (శనివారం) ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో హోస్కోటే అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శరత్ బచ్గౌడ విజేతగా నిలిచారు. అయితే ఆయన గెలిచాడని ఎన్నికల సంఘం ప్రకటించగానే శరత్ బచ్గౌడ మద్దతుదారులు రోడ్డుపై టపాసులు పేల్చడం ప్రారంభించారు. ఈ సమయంలో బీజేపీ కార్యకర్త అయిన కృష్ణప్ప కాంగ్రెస్ మద్దతుదారులతో వాగ్వాదానికి దిగారు.

నా సింప్లిసిటీ చూసి ప్రధానికి అత్తనంటే ఎవరు నమ్మలేదు - సుధామూర్తి

దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. కృష్ణప్పపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనతో పాటు మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని హాస్పిటల్ కు తరలించారు. అయితే తీవ్ర గాయాలపాలైన బాధితుడు.. చికిత్స పొందుతున్న సమయంలోనే  పరిస్థితి విషమించడంతో మరణించాడు.

కర్ణాటక సీఎం రేసులో సిద్ధరామయ్య ముందంజ.. బ్యాలెట్ ఓటింగ్ లో ఆయన వైపే ఎమ్మెల్యేల మొగ్గు..?

ఈ కేసులో ప్రమేయం ఉన్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కాషాయ పార్టీకి మద్దతుదారుగా ఉన్నందునే కృష్ణప్పను హత్య చేశారని బీజేపీ అభ్యర్థి ఎంటీబీ నాగరాజ్ ఆరోపించారు. కృష్ణప్పకు, నిందితుడికి వ్యక్తిగత కక్షలు ఉన్నాయని, టపాసులు పేల్చే విషయంలో గొడవ జరగడంతో వారు అతనిపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. మరోవైపు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, ఇతర నేతలు కేఎస్ ఈశ్వరప్ప, ఎంటీబీ నాగరాజ్ హోస్కోటేలో మృతుల కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కాగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బచ్చగౌడ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నాగరాజుపై 4 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
 

click me!