పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడులు జరిగి 22 ఏళ్లు ముగిసిన రోజే లోక్‌సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది . ఈ నేపథ్యంలో పార్లమెంట్ సెక్యూరిటీ బాధ్యతలను పూర్తి స్థాయిలో Central Industrial Security Force (CISF) కి అప్పగించాలని కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడులు జరిగి 22 ఏళ్లు ముగిసిన రోజే లోక్‌సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఇద్దరు వ్యక్తులు లోక్‌సభలోకి దూసుకెళ్లి పొగ బాంబులు వదిలారు. దీంతో ఎంపీలు భయంతో పరుగులు తీయగా.. కొందరు మాత్రం ధైర్యంగా వారిని పట్టుకున్నారు. పార్లమెంట్ వెలుపల ఆందోళన చేస్తున్న మరో ఇద్దరిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారందరూ ప్రస్తుతం ఢిల్లీ పోలీస్ కస్టడీలో వున్నారు. ఈ సంఘటన తర్వాత కొత్త పార్లమెంట్ వద్ద భద్రతపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విపక్షాలు సైతం కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి . ఇలాంటి పరిస్థితుల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది.
పార్లమెంట్ సెక్యూరిటీ బాధ్యతలను పూర్తి స్థాయిలో Central Industrial Security Force (CISF) కి అప్పగించాలని కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశ రాజధానిలోని కేంద్ర మంత్రిత్వ శాఖల భవనాలకు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పార్లమెంట్‌కు కూడా సీఐఎస్ఎఫ్‌తో భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు పార్లమెంట్ భద్రత బాధ్యత ఢిల్లీ పోలీసుల చేతుల్లోనే వుండేది.
Also Read: parliament security breach : నిందితుడితో సంబంధాలు.. కర్ణాటకలో రిటైర్డ్ ఎస్పీ కుమారుడు అరెస్ట్
అయితే ఇటీవల లోక్‌సభలో భద్రతా వైఫల్యం నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన కేంద్ర హోంశాఖ సీఐఎస్ఎఫ్‌కి ఆ బాధ్యతలు అప్పగించింది. ఢిల్లీ పోలీసులు మాత్రం పార్లమెంట్ వెలుపల భద్రత కల్పిస్తారు. హోం శాఖ నిర్ణయంతో పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీసెస్ , ఢిల్లీ పోలీసులు, పార్లమెంట్ డ్యూటీ గ్రూప్, సీఆర్‌పీఎఫ్‌లు ఇకపై సీఐఎస్ఎఫ్ కిందే విధులు నిర్వర్తించనున్నాయి.
గత బుధవారం పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మణిపూర్ అశాంతి, దేశంలో నిరుద్యోగం, రైతుల సమస్యలపై ప్రజల దృష్టిని ఆకర్షించడమే తమ లక్ష్యమని నిందితులు పోలీసులకు తెలిపారు. అయితే అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. లోక్‌సభలోకి చొరబడిన మనోరంజన్, సాగర్ శర్మలతో పాటు అమోల్ షిండే, నీలం ఆజాద్ ఈ మొత్తం ఘటనకు సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝా, అతనికి సహకరించిన మహేశ్ కుమావత్‌లు ప్రస్తుతం పోలీసుల అదుపులో వున్నారు.