పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడులు జరిగి 22 ఏళ్లు ముగిసిన రోజే లోక్‌సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి కర్ణాటకకు చెందిన రిటైర్డ్ పోలీస్ అధికారి కుమారుడిని ఢిల్లీ పోలీసులు బాగల్‌కోట్‌లోని అతని ఇంటి నుంచి నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడులు జరిగి 22 ఏళ్లు ముగిసిన రోజే లోక్‌సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఇద్దరు వ్యక్తులు లోక్‌సభలోకి దూసుకెళ్లి పొగ బాంబులు వదిలారు. దీంతో ఎంపీలు భయంతో పరుగులు తీయగా.. కొందరు మాత్రం ధైర్యంగా వారిని పట్టుకున్నారు. పార్లమెంట్ వెలుపల ఆందోళన చేస్తున్న మరో ఇద్దరిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారందరూ ప్రస్తుతం ఢిల్లీ పోలీస్ కస్టడీలో వున్నారు. ఈ కేసుకు సంబంధించి కర్ణాటకకు చెందిన ఒక ఇంజనీర్‌ను, రిటైర్డ్ పోలీస్ అధికారి కుమారుడిని ఢిల్లీ పోలీసులు బాగల్‌కోట్‌లోని అతని ఇంటి నుంచి నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతనిని కర్ణాటక నుంచి దేశ రాజధానికి తరలిస్తున్నారు.
నిందితుడిని సాయికృష్ణ జగలిగా గుర్తించారు. ఇతను లోక్‌సభ ఛాంబర్‌లోకి చొరబడి పొగ బాంబులు విసిరిన చొరబాటుదారులలో ఒకరైన మనోరంజన్ డి స్నేహితుడు. ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురిలో మనోరంజన్ కూడా ఒకరు. సాయికృష్ణ, మనోరంజన్‌లు బెంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బ్యాచ్‌మేట్స్‌గా వున్నట్లు సమాచారం. పోలీస్ విచారణలో సాయికృష్ణ పేరును మనోరంజన్ చెప్పాడు. ఇంజనీర్ అయిన సాయికృష్ణ రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుమారుడు. సాయికృష్ణ ప్రస్తుతం బాగల్‌కోట్ లోని తన ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. తన సోదరుడు ఎలాంటి తప్పు చేయలేని అతని సోదరి మీడియాకు తెలిపారు. ఢిల్లీ పోలీసులు తమ ఇంటికి వచ్చిన మాట వాస్తవమేనని.. తన సోదరుడిని వారు ప్రశ్నించారని ఆమె వెల్లడించారు. విచారణకు తాము పూర్తిగా సహకరించామని, సాయికృష్ణ, మనోరంజన్‌లు రూమ్మేట్స్ అని చెప్పారు.
గత బుధవారం పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మణిపూర్ అశాంతి, దేశంలో నిరుద్యోగం, రైతుల సమస్యలపై ప్రజల దృష్టిని ఆకర్షించడమే తమ లక్ష్యమని నిందితులు పోలీసులకు తెలిపారు. అయితే అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. లోక్‌సభలోకి చొరబడిన మనోరంజన్, సాగర్ శర్మలతో పాటు అమోల్ షిండే, నీలం ఆజాద్ ఈ మొత్తం ఘటనకు సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝా, అతనికి సహకరించిన మహేశ్ కుమావత్‌లు ప్రస్తుతం పోలీసుల అదుపులో వున్నారు.