డిజిటల్ పేమెంట్స్ వద్దంట.. డిజిటల్ డొనేషన్స్ కావాలట, అర్ధం కాని కాంగ్రెస్ తత్వం, నెటిజన్ల చురకలు

By Siva Kodati  |  First Published Dec 21, 2023, 3:40 PM IST

2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నిధుల సమీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ బలోపేతానికి గాను క్రౌడ్ ఫండింగ్‌కు వెళ్లాలని డిసైడ్ అయ్యింది. దీనిలో భాగంగా డిసెంబర్ 18 నుంచి ‘‘డొనేట్ ఫర్ దేశ్’’ పేరిట ఈ కార్యక్రమాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రారంభించారు.


2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నిధుల సమీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ బలోపేతానికి గాను క్రౌడ్ ఫండింగ్‌కు వెళ్లాలని డిసైడ్ అయ్యింది. దీనిలో భాగంగా డిసెంబర్ 18 నుంచి ‘‘డొనేట్ ఫర్ దేశ్’’ పేరిట ఈ కార్యక్రమాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ పుట్టి 138 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 18 ఏళ్లు పైబడిన భారతీయులు రూ.138 నుంచి మొదలుపెట్టి.. రూ.1380, రూ.13,800 విరాళం ఇవ్వొచ్చని ఆ పార్టీ ప్రకటించింది.

డిసెంబర్ 28 వరకు ఆన్‌లైన్ వేదికగా.. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో విరాళాల సేకరణ చేపడతామన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 100 ఏళ్ల క్రితం ప్రారంభించిన ‘‘తిలక్ స్వరాజ్ ఫండ్ ’’ స్పూర్తితో ‘‘డొనేట్ ఫర్ దేశ్’’ చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. దీని ప్రకారం కాంగ్రెస్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి దాతలు ఆ పార్టీకి విరాళాలు ఇవ్వొచ్చు. ఎక్కువ మొత్తం విరాళంగా ఇవ్వాలని అనుకుంటే మాత్రం.. అదే వెబ్‌సైట్‌లో Other అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 

Latest Videos

అయితే కాంగ్రెస్ క్రౌడ్ ఫండింగ్‌పై బీజేపీ ఘాటు విమర్శలు చేసింది. 60 ఏళ్లుగా దేశాన్ని దోచుకున్నవారు ఇప్పుడు మాత్రం విరాళాలు ఇవ్వాలని కోరుతున్నారని దుయ్యబట్టారు. జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ ఇంట్లో దొరికిన నోట్ల కట్టల వ్యవహారం నుంచి జాతి దృష్టిని మరల్చేందుకే ఆ పార్టీ ఈ ఎత్తుగడ వేసిందని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రజాధనాన్ని గాంధీ కుటుంబానికి సమర్పించేందుకే ఆ పార్టీ ఇలాంటి పనులకు దిగిందని వారు విమర్శిస్తున్నారు. 

ఇకపోతే.. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ (ఏడీఆర్) సంస్థ ఇటీవల గణాంకాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ నిధుల విలువ రూ.805 కోట్లుగా వుంది. అదే సమయంలో బీజేపీ నిధుల విలువ మాత్రం రూ.6,046 కోట్లుగా వుంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి అందే విరాళాలు గడిచిన ఏడేళ్లలో తగ్గుముఖం పట్టినట్లు ఏడీఆర్ వెల్లడించింది. బీజేపీకి అందిన కార్పోరేట్ విరాళాల మొత్తం విలువ.. అన్ని జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల కంటే మూడు రెట్లు ఎక్కువ. ఈ నేపథ్యంలోనే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నిధుల సమస్యను అధిగమించేందుకు కాంగ్రెస్ పార్టీ క్రౌడ్ ఫండింగ్‌ను అనుసరించాలని నిర్ణయించింది.

మరోవైపు..కాంగ్రెస్ పార్టీ డిజిటల్ డొనేషన్స్‌కు వెళ్లడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు చురకలంటిస్తున్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ చెల్లింపుల విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ అదే పేమెంట్స్ విధానాన్ని హస్తం పార్టీ ఎంచుకోవడంపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. 2017 ఫిబ్రవరిలో తన “Fearless in Opposition: Power and Accountability” పుస్తకావిష్కరణ సభలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మాట్లాడుతూ డిజిటల్ చెల్లింపులపై విమర్శలు గుప్పించారు. దేశంలో సంపూర్ణ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. డీమోనిటైజేషన్‌ను పెద్ద “స్కామ్” అని చిదంబరం అభివర్ణించారు. 

ప్రతిరోజు డిజిటల్‌ విధానంలో లక్ష కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని, అప్పుడు మధ్యవర్తులకు 1500 కోట్ల రూపాయలు వస్తాయని ఆరోపించారు చిదంబరం. నగదు ఇచ్చి మందులు కొనుగోలు చేసే వృద్ధుని హక్కును కాలరాయడం దారుణమన్నారు. నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి రావడానికి కనీసం 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని చిదంబరం వ్యాఖ్యానించారు.

కొనుగోలుదారు నుండి కొనుగోలుదారు వరకు రోజుకు 10 లావాదేవీలలో వంద రూపాయల నోటు 10 చేతులు మారితే, ఆ లావాదేవీ నుండి ఏ మధ్యవర్తి ప్రయోజనం పొందరని ఆయన చెప్పారు. కొనుగోలుదారు రూ. 100 నోటు ఇచ్చి రూ. 100 విలువైన వస్తువులు లేదా సేవలను తీసుకుంటారని, అప్పుడు విక్రేతకు రూ.100 నోటు వస్తుంది. దీని వల్ల మధ్యవర్తి ఎవరూ ప్రయోజనం పొందరని చిదంబరం పేర్కొన్నారు. 

కానీ చిదంబరం భయపడిన విధంగా భారత ఆర్ధిక వ్యవస్ధకు ఎలాంటి నష్టం కలగలేదు. కరోనా సమయంలో , ఆ తర్వాత డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగాయని అనేక సర్వేలు చెబుతున్నాయి. భవిష్యత్తులో నగదు రహిత ఆర్ధిక వ్యవస్ధగా భారత్‌ను మార్చేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. ఇప్పుడు కాలంతో పాటు వచ్చిన మార్పులకు అనుగుణంగా విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీయే ‘‘డిజిటల్ పేమెంట్స్’’ వ్యవస్ధను వినియోగించుకుంటూ వుండటం గమనార్హం. 
 

click me!