
న్యూఢిల్లీ: నేడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఆందోళనలే కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ (Ukarine)పై రష్యా (Russia) దాడితో అన్ని దేశాల్లోనూ ఈ ఆందోళనలు ఉన్నాయి. మన దేశంలో ఈ రెండు పక్షాలకు సమాన దూరాన్ని పాటిస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి సంబంధం లేకుండానే చైనా, పాకిస్తాన్‌ల కారణంగా భారత్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సి వస్తున్నది. ఒకవైపు ఉగ్రవాదులను సరిహద్దు గుండా పంపించి దేశంలో బీభత్సం సృష్టించాలని పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుండగా.. చైనా సరిహద్దుపై నజర్ వేస్తున్నది. ఇప్పటికే భారత్, చైనా (China)ల మధ్య సరిహద్దు ఘర్షణలు జరుగుతున్నాయి. లడాఖ్ (Ladakh)లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలు ఇప్పటికీ చల్లారలేదు. ఇంకా శాంతి పునస్థాపనకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వీటికితోడు సరిహద్దులో మరికొన్ని చోట్లా చైనా కవ్వింపులకు దిగుతున్నదని, దురాక్రమించే ప్రయత్నాలు చేస్తున్నదని వార్త కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనా మిలిటరీ బడ్జెట్(Defence Budget) పెంచడం కొంత కలవరం కలిగించే అంశంగా ఉన్నది.
గతేడాది కంటే వచ్చే నూతన ఆర్థిక సంవత్సరంలో డిఫెన్స్ బడ్జెట్‌ను చైనా ప్రతిపాదించింది. 2022 ఆర్థిక సంవత్సరానికి గాను మిలిటరీ బడ్జెట్‌ను గతేడాది కంటే 7.1 శాతం పెంచింది. గతేడాది చైనా డిఫెన్స్ బడ్జెట్ 209 అమెరికన్ బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఈ ఏడాది దాన్ని 7.1 శాతం పెంచి 230 అమెరికన్ బిలియన్ డాలర్లకు పెంచుకుంది. చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌లో చైనా ప్రభుత్వం ఈ రోజు బడ్జెట్ డ్రాఫ్ట్‌ను ప్రవేశపెట్టింది. 2022 ఆర్థిక సంవత్సరానికిగాను 1.45 ట్రిలియన్ యువాన్లను చైనా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పెరుగుదలతో రక్షణ కోసం భారత్ కేటాయించే మొత్తానికి చైనా మూడు రెట్లు కేటాయించినట్టు స్పష్టం అవుతున్నది.
2022 ఆర్థిక సంవత్సరానికి భారత్ డిఫెన్స్ బడ్జెట్‌ను 5.25 లక్షల కోట్లు (సుమారు 70 అమెరికన్ బిలియన్ డాలర్లు)గా ఉన్నది. కాగా, అదే ఆర్థిక సంవత్సరానికి చైనా ప్రభుత్వం డిఫెన్స్ బడ్జెట్‌ను 230 అమెరికన్ బిలియన్ డాలర్లకు పెంచాలని ప్రతిపాదించింది. ఇది భారత్ కేటాయించిన మొత్తాల కన్నా మూడు రెట్లకు అధికంగా ఉన్నది.
నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌లో చైనీస్ ప్రీమియర్ లీ కేకియంగ్ ఈ బడ్జెట్ డ్రాఫ్ట్ ప్రవేశపెడుతూ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ లోతుగా యుద్ధానికి సంసిద్ధంగా ఉండాలని వివరించారు. చైనా దేశ సార్వభౌమ, రక్షణ, అభివృద్ధి ప్రయోజనాలను రక్షించడానికి ఎల్లప్పుడూ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.
భారత్ ఆర్మీతోో చైనా ఆర్మీ స్టాండఫ్ ఇంకా కొనసాగుతున్న తరుణంలో చైనా డిఫెన్స్ బడ్జెట్‌ను పెంచింది. ఒక వైపు భారత్‌తో సరిహద్దులో ఘర్షణలు కొనసాగిస్తూనే ఉన్నది. మరోవైపు రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య దాడుల కారణంగా చైనా పైనా అమెరికా ఆంక్షలు విధించే ముప్పు ఉన్నది. ఈ టెన్షన్స్ మరో వైపు. ఇలాంటి తరుణంలో చైనా డిఫెన్స్ బడ్జెం పెంచుకుంది.
అమెరికా తర్వాత అత్యధిక డిఫెన్స్ బడ్జెట్ కేవలం చైనాది మాత్రమే.