ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని భోజిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు.
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలోని భోజిపురా ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. భోజిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రక్కును కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతి చెందిన వారిలో ఓ చిన్నారి కూడ ఉంది.
బరేలి నగరంలోని ఓ వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా కారులో ప్రయాణీస్తున్న వారు ప్రమాదంలో మృతి చెందారు. ట్రక్కు, కారుఢీకొనడంతో మంటలు చెలరేగాయి. కారు, ట్రక్కు మంటల్లో చిక్కుకున్నాయి. దీంతో కారులోని ఎనిమిది మంది మృతి చెందారు.
కారులో సెంట్రల్ లాక్ జామ్ కావడంతో కారులోని ప్రయాణీకులు బయటకు రాలేకపోయారు. ట్రక్కు , లారీ ఢీకొనడంతో ఈ కారు సెంట్రల్ లాక్ జామ్ అయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కారుకు మంటలు అంటుకోవడంతో కారు నుండి బయటకు వచ్చేందుకు బాధితులు ప్రయత్నించారు. అయితే కారు సెంట్రల్ లాక్ జామ్ కావడంతో కారు నుండి వారు బయటకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కారును ట్రక్కు సుమారు 25 మీటర్ల దూరం లాక్కెళ్లింది. ఈ సమయంలో మంటలు వ్యాపించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.కారులోని మృతదేహలను బయటకు తీసేందుకు పోలీసులు కనీసం గంట సేపు కష్టపడ్డారు.
ఈ ప్రమాదం జరిగిన ప్రదేశానికి దబౌరా గ్రామం ఉంది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఈ గ్రామం 200 మీటర్ల దూరంలో ఉంటుంది.ఈ ప్రమాదం గురించి దబౌరా గ్రామస్తులకు ఆలస్యంగా సమాచారం అందింది. ఈ సమాచారం ముందుగా తెలిస్తే ఈ ప్రమాదం నుండి కొందరైనా బతికేవారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రమాదం కారణంగా నైనిటాల్ జాతీయ రహదారిపై ఒక వైపు లేన్ ను మూసివేశారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున కారు నుండి మృతదేహలను బయటకు తీశారు. అనంతరం కారు, ట్రక్కును రోడ్డుపై నుండి క్రేన్ సహాయంతో బయటకు తీశారు.
దేశవ్యాప్తంగా ప్రతి రోజూ ప్రతి రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు అతి వేగంతో పాటు డ్రైవర్ల నిర్లక్ష్యం వంటివి ప్రధాన కారణాలుగా పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు నిపుణులు, పోలీసులు అనేక సూచనలు చేస్తున్నారు. అయితే వీటిని వాహనదారులు పట్టించుకోని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.