BR Gavai: కుగ్రామం నుంచి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా.. గ‌వాయ్ జీవిత విశేషాలు

Published : May 15, 2025, 12:21 PM IST
BR Gavai: కుగ్రామం నుంచి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా.. గ‌వాయ్ జీవిత విశేషాలు

సారాంశం

జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా బుధవారం ప్రమాణం చేసిన విష‌యం తెలిసిందే. రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్‌ గవాయ్‌తో ప్రమాణం చేయించారు. ప్రమాణం అనంతరం జస్టిస్‌ గవాయ్‌ తన తల్లి కమల్‌తాయి గవాయ్‌కి పాదాభివందనం చేశారు.  

కాగా  ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా, జేపీ నడ్డా, అర్జున్‌రాం మేఘ్వాల్‌, ఉప రాష్ట్రపతి జగ్దీప్‌ ధన్‌ఖడ్‌, మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, విపక్షనేత రాహుల్‌గాంధీ తదితరులు హాజరయ్యారు. 64 ఏళ్ల వయసున్న జస్టిస్‌ గవాయ్‌.. ఈ ఏడాది నవంబరు 23 వరకూ సీజేఐ పదవిలో కొనసాగనున్నారు. ఈ నేప‌థ్యంలో గ‌వాయ్ జీవితానికి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరడం అరుదైన విషయం. కానీ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (బీఆర్ గవాయ్) ఆ విశేష గౌరవాన్ని పొందారు. ఆయన తాజాగా భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

దేశానికి తొలి బౌద్ధ సీజేఐ:

భూషణ్ గవాయ్ సుప్రీంకోర్టు తొలి బౌద్ధ ప్రధాన న్యాయమూర్తిగా చరిత్రకెక్కారు. దళిత వర్గానికి చెందిన ఆయన, 2007లో పదవిలోకి వచ్చిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత రెండో దళిత సీజేఐగా ఎంపికయ్యారు.

కుగ్రామం నుంచి: 

1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ చిన్న గ్రామంలో జన్మించిన గవాయ్, రాజకీయ నాయకుడు ఆర్‌ఎస్ గవాయ్ కుమారుడు. ఆయన తండ్రి లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గవర్నర్‌గా కూడా సేవలందించారు. దీక్షాభూమి స్మారక కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు.

భూషణ్ గవాయ్ 1985లో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు. నాగపూర్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిల్‌గా, బాంబే హైకోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2005లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019లో సుప్రీంకోర్టులో బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 

కీలక తీర్పులు:

భూషణ్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనాలు ఎన్నో చారిత్రక తీర్పులు వెలువరించాయి:

* నోట్ల రద్దును రాజ్యాంగబద్ధంగా సమర్థించిన బెంచ్‌లో సభ్యుడు.

* ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనని చెప్పిన ధర్మాసనంలో భాగస్వామి.

* ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ అమలుకు అనుమతి ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి.

* ఎలక్టోరల్ బాండ్స్ చట్ట విరుద్ధమని ప్రకటించిన తీర్పులో భాగం.

* రాహుల్ గాంధీ కేసు, తీస్తా సెతల్వాద్ బెయిల్, సిసోడియా బెయిల్ వంటి సంచలన విషయాల్లో కీలక తీర్పులు వెలువరించారు.

ప్రధాన న్యాయమూర్తి జీతం, సౌకర్యాలు: 

* భారత ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం, ప్రధాన న్యాయమూర్తికి ప్రతి నెలా రూ.2.80 లక్షల జీతం లభిస్తుంది. 

* ఈ జీతం “సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల జీతాల చట్టం” కింద అందిస్తుంది. ఇందులో ప్రాథమిక జీతం మాత్రమే ఉంటుంది. ఇతర సౌకర్యాలు అద‌నంగా అందిస్తారు. 

* జీతంతో పాటు ఢిల్లీలో ఉచిత ప్రభుత్వ గృహ నిర్మాణం.

* వ్యక్తిగత సహాయకులు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు. 

* విద్యుత్, నీరు ఉచితం లేదా చాలా తక్కువ ధరలకు అందిస్తారు. 

* ఉచిత మొబైల్, ల్యాండ్‌లైన్ కాలింగ్ అందుబాటులో ఉంటుంది. 

* ప్రభుత్వ ఖర్చుతో దేశంలో,విదేశాలకు ప్రయాణం 

* ఉచిత వైద్య సౌకర్యం -సర్వీసు తర్వాత పెన్షన్, భద్రతా ప్రయోజనాలు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?