
సుక్మా: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో కలకలం చోటు చేసుకొంది. ఏడుగురు యువకులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. యువకుల కోసం గాలిస్తూ అడవిలోకి వెళ్లిన నలుగురి ఆచూకీ కూడ తెలియరాలేదు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.సుక్మా జిల్లాలోని జేగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందేడ్ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు ఈ నెల 18వ తేదీన కిడ్నాపయ్యారు. మావోయిస్టులే వారిని కిడ్నాప్ చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఏడుగురు యువకులను మావోయిస్టులు ఎందుకు కిడ్నాప్ చేసి ఉంటారనే విషయమై తమకు అంతుపట్టడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు.రెండు రోజులు దాటినా కూడ 11 మంది ఆచూకీ లేకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
కొన్ని రోజుల క్రితం ఈ గ్రామానికి చెందిన కొందరు వివాహా వేడుకలు లేదా ఏదైనా ఫంక్షన్ కు హాజరైనట్టుగా పోలీసులు భావిస్తున్నారు. వారంతా తమ ఇళ్లకు తిరిగి రాలేదని పోలీసులు చెప్పారు. వీరిని మావోయిస్టులు తమ బందీలుగా ఉంచుకొన్నారనే అనుమానాలు కూడ గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారని పోలీసులు చెప్పారు. మావోయిస్టుల బందీలుగా ఉన్న వారి సమాచారం కోసం తాము ప్రయత్నిస్తున్నామని బస్తర్ జోన్ పోలీస్ అధికారి సుందర్ రాజ్ చెప్పారు.