
Chhattisgarh Encounter : మావోయిస్టులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఇవాళ(గురువారం) చత్తీస్ ఘడ్ అడవుల్లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 10మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ ఉన్నట్లు సమాచారం.
చత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో తలపై కోటి రూపాయల బహుమతి కలిగిన మనోజ్ అలియాస్ మోడెం బాలకృష్ణ చనిపోయినట్లు ప్రకటించారు. మోడెం, ఇతర మావోయిస్టుల మరణాన్ని ఎస్పీ నిఖిల్ రాఖేచా ధ్రువీకరించారు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం, భద్రతా దళాలకు ఇది పెద్ద విజయమనే చెెప్పాలి.
భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో ఎస్టీఎఫ్, కోబ్రా (సీఆర్పీఎఫ్ కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్), రాష్ట్ర పోలీసులు పాల్గొన్నారని రాయ్‌పూర్ రేంజ్ ఐజీ అమరేష్ మిశ్రా తెలిపారు. బుధవారం భద్రతా దళాలు ఈ ఆపరేషన్ ప్రారంభించాయి. మౌన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో భద్రతా సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు... ఈ క్రమంలోనే వారికి, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో పదిమంది మావోలు చనిపోగా భద్రతా బలగాల్లో అందరూ సురక్షితంగానే ఉన్నట్లు సమాాచారం.
మనోజ్ అలియాస్ మోడెం బాలకృష్ణ మావోయిస్టు సంస్థలో ప్రధాన నాయకుల్లో ఒకడు. అతను అనేక మావోయిస్టు దాడుల్లో భాగస్వామి. అతనిపై దోపిడీ నుంచి హత్య వరకు అనేక కేసులు నమోదయ్యాయి. చత్తీస్‌గఢ్‌తో సహా దేశవ్యాప్తంగా మావోయిస్టు కార్యకలాపాలకు అతను ప్రధాన సూత్రధారి. అతన్ని హతమార్చడం అంటే భద్రతా దళాలు మావోయిస్టు సంస్థ వెన్నెముక విరిచినట్లే.