Chennai floods: చెన్నై వాసులకు పీడకల.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వరదలు, పవర్ కట్స్..

By team teluguFirst Published Nov 30, 2021, 10:37 AM IST
Highlights

తమిళనాడును భారీ వర్షాలు (Heavy Rains) వదలడం లేదు. వరదలు (Floods) కారణంగా చెన్నై వాసులు కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొందరు  నిత్యావసరాలు కూడా లేక తల్లడిల్లి పోతున్నారు.

తమిళనాడును భారీ వర్షాలు (Heavy Rains) వదలడం లేదు. భారీ వర్షాలు, వరదలు కారణంగా ఇటీవల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు.. మరోసారి అటువంటి పరిస్థితులనే చూస్తున్నారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాలో కురుస్తున్న వర్షాల‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు జలదిగ్బందంలోనే ఉన్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొందరు  నిత్యావసరాలు కూడా లేక తల్లడిల్లి పోతున్నారు. కాలనీలు చెరువులను తలపిస్తుండటంతో ఎటు వెళ్లలేని పరిస్థితి. 

భారీ వర్షాలు, వరదలు (Floods) కారణంగా చెన్నై వాసులు కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన కొందరు ప్రజలను సహాయక శిబిరాలకు తరలించినప్పటికీ.. చాలా చోట్ల ప్రజలు ఇంకా వరద ముంపులోనే ఉన్నారు.  దీంతో వారంతా సాయం కోసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. చాలా చోట్ల కరెంట్ కూడా నిలిచిపోవడంతో.. రాత్రిళ్లు చీకట్లోనే గడపాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక, చిన్న పిల్లలు ఉన్నవారి బాధలు చాలా దారుణంగా ఉన్నాయి. అసలే వరద నీటిలో కొట్టుకొచ్చిన పాములు, విషపు ప్రాణులు ఎక్కడ తమ ఇళ్లలోకి చేరుతాయనే ఆందోళన చెందుతున్నారు. అయితే చెన్నైలో వరదల్లో చిక్కకున్న కొందరు ప్రజలు పడిన ఇబ్బందుల గురించి తెలుసుకుందాం..

-నారాయణపురంలోని (Narayanapuram) చెట్టినాడ్ ఎన్‌క్లేవ్‌లోని దాదాపు 200 ఇళ్లను వరద నీరు ముంచెత్తింది. అయితే అక్కడే నివాసం ఉండే యోగానందన్ కుటుంబం నాలుగు రోజులు ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. పూర్తిగా వరద నీరు చేరడం, కరెంట్ లేకరపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడింది. వారు నాలుగు రోజులుగా వరద నీటిలో చిక్కుకున్నట్టుగా తెలుసుకున్న పోలీసులు.. వారిని రక్షిచంచారు. ఇక, అనంతరం యోగానందన్‌ కుటుంబం హోటల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి యోగానందన్ మాట్లాడుతూ.. గత నాలుగు రోజుల నుంచి మాకు ఇంట్లో కరెంట్ లేదు. ఇకపై మేము ఇలాగే ఉండలేమని చెప్పారు. 

Also Read: Tamil Nadu rains: కొనసాగుతున్న వర్ష బీభత్సం.. 9 జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు..

- అయితే ఈ ఎన్‌క్లేవ్‌ను అనై ఏరి సరస్సు‌ సమీపంలో నిర్మించడింది. అయితే దీనికి  చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (Chennai Metropolitan Development Authority) ఆమోదం కూడా ఉంది. కానీ ఇక్కడ భారీ వర్షాలు, వరదలు వచ్చిన ప్రతిసారి ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ సారి కూడా తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. 

- ఇదే ప్రాంతానికి చెందిన వాసుదేవన్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘మేము 2015 నుంచి నీటి పన్ను చెల్లిస్తూనే ఉన్నాం. కానీ ఎప్పుడు వాటర్ మాత్రం సరిగా రావడం లేదు. ఇప్పుడు వాష్‌‌రూమ్‌‌లో కూడా నీళ్లు లేని పరిస్థితి. కనీసం ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను పునరుద్దరించడానికైనా అధికారులు ప్రయత్నించాలి’ అని కోరారు. 

-పాములు ఇళ్లలోని వస్తాయనే భయం తమను వెంటాడుతుందని.. ఇంట్లో పిల్లలు ఉండటంతో వారి గురించి టెన్షన్ పడుతున్నట్టుగా సుకన్య అనే మహిళ చెప్పింది. 

- ఇది ఒక పీడకల.. తన తండ్రికి ఇటీవల మెదడు శస్త్రచికిత్స జరిగిందని.. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు తీసుకెళ్లే పరిస్థితులు కూడా లేవని సోనా అనే యువతి ఆందోళన వ్యక్తం చేసింది. 

- నాలుగు రోజులుగా  కరెంట్ లేకపోవడంతో పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న వారు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వరదలు, కరెంట్ కోతల వల్ల తాము చదువుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అయితే తమ కాలనీ అభివృద్దిలో అక్రమాలు జరుగుతున్నాయిన అక్కడి నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. తమది ఆమోదం పొందిన లే అవుట్ అని.. గతంలో తమ ప్రాంతంలో నీరు ఆగకుండా వెళ్లిపోయేదని.. అయితే కొంతకాలంగా చెరువులు అక్రమణలకు గురవుతున్నాయని, అందువల్ల తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆ కాలనీకి చెందిన కైలాష్ చెప్పారు. 

నిపుణులు మాత్రం కొందరు అడ్డగోలుగా ఎక్కడిపడితే అక్కడ ఇళ్లను నిర్మించడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. అయితే భారీ వదర నీరును నగరం నుంచి బయటకు తరలించేలా కాలువల నిర్మాణం, ఇతర చర్యలు చేపట్టాలని భావించినప్పటికీ.. ఆ దిశగా ప్రయత్నాలు ఫలించడం లేదనే చెప్పాలి. 

ఇదిలా ఉంటే రాబోయే మూడు రోజులు కూడా చెన్నైలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక, చెన్నైలో అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 1,000 మి.మీ కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇందులో ఎక్కువ భాగం నవంబర్‌లో కురిసిన వర్షాలే.  

click me!