
న్యూఢిల్లీ:చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన రోవర్ తన పరిశోధనలను ప్రారంభించింది. చంద్రుడిపై అడుగు పెట్టిన తర్వాత ప్రగ్యాన్ రోవర్ పరిశోధనలకు సంబంధించిన అంశాలను ఇస్రో ఆదివారంనాడు వెల్లడించింది. విక్రమ్ ల్యాండర్ లోని చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పరిమెంట్ పేలోడ్ చంద్రుడిపై సేకరించిన ఉష్ణోగ్రతలను ఇస్రో ప్రకటించింది. ట్విట్టర్ ద్వారా ఈ పరిశోధనలకు సంబంధించిన గ్రాఫ్ ను ఇస్రో వెల్లడించింది.
చంద్రుడి ఉపరితలంపై సుమారు 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టుగా ఇస్రో తెలిపింది. అయితే చంద్రుడి 80 మిల్లీ మీటర్ల లోతులో ఉష్ణోగ్రత మైనస్ 10 డిగ్రీలుగా నమోదైనట్టుగా పేలోడ్ పంపిన గణాంకాలు చెబుతున్నాయని ఇస్రో వివరించింది.
వివిధ లోతుల వద్ద చంద్రుడి నేలపై 10 సెం.మీ . లోతులో ఉష్ణోగ్రతను ఈ పేలోడ్ చేరుకోగలరు. చంద్రయాన్-3 లో ఏడు పేలోడ్‌లను ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుడిపైకి పంపారు. విక్రమ్ ల్యాండర్ లో నాలుగు, ప్రగ్యాన్ రోవర్ లో రెండు, ప్రొపల్షన్ మాడ్యూల్ లో ఒక పేలోడ్ ఉంది. విభిన్న శాస్త్రీయ ప్రయోగాలు చేసేందుకు ఈ పేలోడ్ లు ఏర్పాటు చేశారు.
మరో వైపు చంద్రుడిపై మట్టిని అధ్యయనం చేసేందుకు అవసరమైన పరికరాలను కూడ ఇస్రో పంపింది.2019లో చంద్రయాన్-2 విఫలమైంది. దీంతో చంద్రయాన్-3 పై ఇస్రో కేంద్రీకరించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై సేఫ్ ల్యాండింగ్ పై ఇస్రో శాస్త్రవేత్తలు కేంద్రీకరించారు.ఈ ఏడాది జూలై 14న చంద్రయాన్-3 ను ప్రయోగిచింది ఇస్రో.ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయింది.
చంద్రుడిపై ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ తమ పనులు కొనసాగిస్తున్నట్టుగా ఇస్రో తెలిపింది. అంతరిక్షనౌకలోని ఐదు పరికరాలను స్విచ్ ఆన్ చేసినట్టుగా ఇస్రో చైర్మెన్ సోమనాథ్ చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ 3వ తేదీ లోపుగా అన్ని ప్రయోగాలు పూర్తవుతాయని ఆయన ఆదివారంనాడు మీడియాకు చెప్పారు.
రోవర్ నుండి రానున్న రోజుల్లో మరిన్ని మంచి ఫలితాలను ఆశిస్తున్నామన్నారు ఇస్రో చైర్మెన్.అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీ సహకారంతో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లోని ఫిజిక్స్ లాబోరేటరీ బృందం ఈ పేలోడ్ ను అభివృద్ది చేసింది.