
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై శివసేన (యూబీటీ), మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. పాకిస్తాన్‌తో భారత్ క్రికెట్ ఆడటం వెనుక ఉన్న లాజిక్ ఏమిటని ప్రశ్నించారు. ఒక వైపు భారత నావికా దళ మాజీ ఆఫీసర్ కుల్‌భూషణ్ జాదవ్ పాకిస్తాన్ జైలులో మగ్గిపోతుంటే ఈ మ్యాచ్‌లు ఎందుకు అని అడిగారు.
‘త్వరలో క్రికెట్ వరల్డ్ కప్ జరగనుంది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశంతో మనం ఎందుకు క్రికెట్ ఆడాలి?’ అని ప్రశ్నించారు. మహారాష్ట్రలోని మరాఠ్వాడ రీజియన్‌లో హింగోలిలో నిర్వహించిన ఓ ర్యాలీని ఉద్దేశిస్తూ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు.
Also Read: మధ్యప్రదేశ్‌లో దళిత యువకుడి దారుణ హత్య.. తల్లిని వివస్త్ర చేసి దాడి
పాకిస్తాన్ జైలులో మగ్గుతున్న కుల్‌భూషణ్ జాదవ్ పేరునూ ఉద్ధవ్ ఠాక్రే లేవనెత్తారు. గూఢాచార అభియోగాల్లో దోషిగా తేల్చి కుల్ భూషణ్ జాదవ్‌ను పాకిస్తాన్ ముప్పు తిప్పలు పెడుతున్నదని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఇప్పటికీ కుల్ భూషణ్ జాదవ్ పాకిస్తాన జైలులో చిత్ర వధ అనుభవిస్తున్నారని, అలాంటప్పుడు ఆ దేశంతో మనం ఎందుకు క్రికెట్ ఆడాలి? అంటూ ప్రధాని మోడీని ప్రశ్నించారు. అసలు ఇప్పుడు కుల్ భూషణ్ జాదవ్ ప్రాణాలతో ఉన్నాడో లేడో కూడా తెలియదని వివరించారు.