జాబిలి పైకి మరోసారి.. జూలైలో చంద్రయాన్-2, విశేషాలివే..!!

By Siva KodatiFirst Published Jun 12, 2019, 4:18 PM IST
Highlights

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఇప్పటికే చంద్రయాన్-1 ద్వారా చంద్రమండలంలో తనకు తిరుగులేదని ప్రపంచానికి తెలియజేసిన ఇస్రో.. చంద్రయాన్-2 ద్వారా మరోసారి చంద్రుడిపై యాత్ర తలపెట్టింది

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఇప్పటికే చంద్రయాన్-1 ద్వారా చంద్రమండలంలో తనకు తిరుగులేదని ప్రపంచానికి తెలియజేసిన ఇస్రో.. చంద్రయాన్-2 ద్వారా మరోసారి చంద్రుడిపై యాత్ర తలపెట్టింది.

బుధవారం బెంగళూరులో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ . కె. శివన్ దీనిపై మీడియాకు వెల్లడించారు. జూలై 15న చంద్రయాన్-2ను ప్రయోగిస్తున్నట్లు తెలిపారు. 15 తెల్లవారుజామున 2.51 నిమిషాలకు జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా మీటరు పొడవైన 25 కేజీల బరువున్న రోవర్, ఆర్బిటర్, ల్యాండర్లను చంద్రుడిపైకి పంపున్నట్లు శివన్ ప్రకటించారు.

ఈ ప్రయోగంలో రాకెట్ నింగిలోకి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆర్బిటర్ ప్రొపెలైజేషన్ విధానంలో ఈ మూడు రకాల పరికరాలు చంద్రుడి కక్ష్యలోకి చేరతాయి. అక్కడ ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రునివైపు దూసుకెళుతుంది.

ఆర్బిటర్ నిర్దేశిత కక్ష్యలో తిరుగుతుంది. అలాగే ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై నిర్దేశిత ప్రాంతంలో దిగుతుందని.. అనంతరం దానిలోంచి రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు ప్రారంభిస్తుందని శివన్ తెలిపారు.

ఈ రోవర్ ప్రయోగాలు చేయడానికి అవసరమైన పరికరాలను కూడా ల్యాండర్‌ పైభాగంలో అమర్చారు. సెప్టెంబర్ నుంచి ఇది సంకేతాలను ఇస్రోకు పంపుతుందని ఛైర్మన్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ మొత్తం ఖర్చు రూ. 1000 కోట్లని.. ఆర్బిటర్, ల్యాండర్‌కు విక్రమ్ అని.. రోవర్‌కు ప్రజ్ఞ అని పేరు పెట్టినట్లుగా శివన్ తెలిపారు.

చంద్రయాన్-2 మొత్తం బరువు సుమారు 3.8 టన్నులని, ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 13 రకాల పరికరాలను చంద్రుడిపైకి పంపిస్తున్నట్లుగా ఇస్రో ఛైర్మన్ వివరించారు. ఇది పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రాజెక్ట్‌ అని, నేవిగేషన్, గైడెన్స్ కోసం నాసా డీప్ స్పేస్ నెట్‌వర్క్‌కు చెల్లింపులు జరిపి భారత్ వాడుకొంటోందని శివన్ తెలిపారు.

ఇంత వరకు ఇస్రో చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇదే అత్యంత కఠినమైన ప్రాజెక్ట్‌ అని ఆయన వెల్లడించారు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయేందుకు 15 నిమిషాల సమయం పడుతుంది.

ఈ మొత్తం ప్రాజెక్ట్‌లో ఇదే అత్యంత కఠినమైదని.. సెప్టెంబర్ 6న చంద్రుడిపై ఇది దిగుతుందని శివన్ వివరించారు. కాగా చంద్రయాన్‌-2లో భారత ల్యాండర్, రోవర్ దిగే దక్షిణ ధ్రువ ప్రదేశానికి ఇంతవరకు ఏ దేశానికి చెందిన ఉపగ్రహాలు చేరలేదు.

click me!