అందరిలా కుప్పిగంతులేయను: కేసిఆర్ ఫ్రంట్ పై చంద్రబాబు వ్యాఖ్య

First Published Jun 1, 2018, 9:12 PM IST
Highlights

కేంద్ర రాజకీయాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: కేంద్ర రాజకీయాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషించడం ఖాయమని, అయితే అందరిలా తాను కుప్పిగంతులు వేయనని ఆయన అన్నారు. 

చిన్న రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రధాని అవుతానంటే అందులో అర్థమేమిటని అన్నారు. తాను ఓ పద్ధతి ప్రకారం చేస్తానని అన్నారు. దేశ రాజకీయాలు అర్థం చేసుకున్న వ్యక్తిని, తాను చాలాసార్లు 1984 నుంచి తాను జాతీయ రాజకీయాల్లో పనిచేస్తున్నానని ఆయన అన్నారు. తనలో పరిపక్వత ఉందని, ఎలా చేయాలో తనకు తెలుసునని ఆయన అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఉద్దేశించే ఆయన ఆ వ్యాఖ్యలు అన్నట్లు భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ పెడుతానంటూ కేసిఆర్ వివిధ ప్రాంతీయ పార్టీల నేతలను కలిసిన విషయం తెలిసిందే.

దేశశ్రేయస్సు కోసం కొన్ని పార్టీలు పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రాంతీయ  పార్టీలు బలోపేతం అవుతున్నాయని అన్నారు. జాతీయ రాజకీయాల పరిస్థితులు, పరిమితులు తనకు తెలుసునని అన్నారు. సోనియా, మోడీలతో తనకేమైనా వ్యక్తిగత తగాదాలున్నాయా అని ఆయన అడిగారు. 

గత నాలుగేళ్లలో కేంద్రం సహకరించలేదని ఆయన అన్నారు. కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి ఆగదని అన్నారు. కట్టుబట్టలతో, అప్పులతో అమరావతికి వచ్చామని ఆయన అన్నారు. రాష్ట్రం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోందని, పూర్తిగా కోలుకోవడానికి మరో ఆరేళ్లు పడుతుందని అన్నారు. 

కేంద్రంపై పోరాటం చేస్తూనే అభివృద్ధి సాధిస్తామని ఆయన అన్నారు. విభజన హామీలపై చివరి ఆయుధం న్యాయపోరాటమని ఆయన అన్నారు. కాంగ్రెసు కన్నా బిజెపి ఎక్కువ అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు. 

స్వయంగా కోరినా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీల రాజీనామాలు ఎందుకు ఆమోదించరని ఆయన అడిగారు. ఇది కుట్ర కాదా అని అడిగారు. రాజీనామాలను ఆమోదిస్తే వెంటనే ఉప ఎన్నికలు వస్తాయని, బండారం బయటపడుతుందని డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. 

అవినీతికి వ్యతిరేకమన్నారు, కర్ణాటకలో ఏం జరిగిందని ఆయన అడిగారు. నోట్ల రద్దు అన్నారు, అసలే డబ్బులు లేకుండా పోయాయని ఆయన అన్నారు.  విభజన తర్వాత సరైన పాలన అందించకుంటే రాష్ట్రం మరో బీహార్ అయి ఉండేదని ఆయన అన్నారు.

click me!