కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. రూ. 75 నాణెం విడుదల చేయనున్న కేంద్రం.. విశేషాలు ఇవే..

Published : May 26, 2023, 10:18 AM IST
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. రూ. 75 నాణెం విడుదల చేయనున్న కేంద్రం.. విశేషాలు ఇవే..

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్ర  మోదీ మే 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్రం రూ.75 నాణెం విడుదల చేయనుంది.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర  మోదీ మే 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్రం రూ.75 నాణెం విడుదల చేయనుంది. ఈ నాణెం విడుదలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. ఈ నాణెం 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను కూడా ప్రతిబింబించేలా ఉపయోగపడుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. రూ.75 నాణెం వృత్తాకారంలో.. 44 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది.

నాణెం అంచుల వెంట 200 సెరేషన్‌లను కలిగి ఉంటుంది. ఈ నాణెం బరువు 35 గ్రాములు ఉంటుంది. ఇందులో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో క్వాటర్నరీ మిశ్రమంతో కూడి ఉంటుంది. నాణేనికి ఒక వైపు అశోక స్తంభం బొమ్మ ఉంటుంది.. దాని కింద ‘‘సత్యమేవ జయతే’’ అని ఉంటుంది. ఎడమవైపు దేవనాగరి లిపిలో.. కుడి వైపున ఆంగ్లంలో ‘‘భారత్’’ అనే పదం వ్రాయబడుతుంది. అలాగే రూపాయి చిహ్నము, అంతర్జాతీయ అంకెలలో 75 డినామినేషన్ విలువ కూడా రాసి ఉంటుంది.

నాణేనికి రెండో వైపు పార్లమెంట్ కాంప్లెక్స్ చిత్రం ఉంటుంది. ఎగువ అంచున దేవనాగరి లిపిలో ‘‘సంసద్ సంకుల్’’, దిగువ అంచున ఆంగ్లంలో ‘‘పార్లమెంట్ కాంప్లెక్స్’’ అనే పదాలు రాసి ఉండనుంది. అలాగే అంతర్జాతీయ అంకెలలో 2023 సంవత్సరం రాయబడుతుంది. ఇక, మొదటి షెడ్యూల్‌లోని నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ నాణెం తయారు చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇక, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి దాదాపు 25 పార్టీలు హాజరవుతారని అంచనా వేయగా.. 20 ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం బీజేపీలో నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో 18 పార్టీలు ఉండగా.. ఏడు ఎన్డీయేతర పార్టీలు ఈ వేడుకకు హాజరు కానున్నాయి. బీఎస్పీ,  శిరోమణి అకాలీదళ్, జనతాదళ్ (సెక్యులర్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), వైఎస్సార్ కాంగ్రెస్, బీజేడీ, టీడీపీలు ఈ వేడుకకు హాజరవుతాయని భావిస్తున్నారు.

ఇక, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బదులుగా కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించాలన్న నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండనున్నట్టుగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీతో సహా పలు విపక్ష పార్టీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్