
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యం, భద్రత ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పరీక్షలు రాయాలనుకునే వారికి కరోనా ఉద్ధృతి తగ్గాక పరీక్షలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే ఆసక్తి ఉన్నవారికి పరీక్షలు నిర్వహించనున్నారు.
Also Read:ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు
కాగా, కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేయడంతో పాటు 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 14న నిర్ణయం తీసుకొంది. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దు చేయాలని అప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఆనాటి సమీక్ష సమావేశంలో టెన్త్ పరీక్షలను రద్దు చేయాలని ప్రధాని మోడీ నిర్ణయం తీసుకొన్నారు.