కేంద్ర ప్రభుత్వ నివాసాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్

Published : May 22, 2025, 05:18 PM IST
Disabled

సారాంశం

Central Government Housing Policy: దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వ నివాసాల కేటాయింపులో 4% రిజర్వేషన్ కల్పిస్తూ గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Central Government Housing Policy: దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలకమైన ముందడుగు వేసింది. ఇకపై, కేంద్ర ప్రభుత్వ నివాసాల కేటాయింపులో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు ప్రకటించింది. ఇది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న నివాసాల్లో దివ్యాంగుల హక్కులను గుర్తించి, సమానత, గౌరవం, యాక్సెస్‌ అంశాలను బలోపేతం చేయడానికి గల ప్రధాన చర్యగా భావిస్తున్నారు. 

ఈ విధానం దివ్యాంగుల హక్కుల చట్టం - 2016 (RPwD చట్టం) ప్రకారం రూపొందించారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ దీనికి సంబంధించిన కార్యాలయ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాల ప్రకారం.. జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకమోడేషన్ (GPRA) కేటాయింపులో, నెలవారీగా ప్రతి తరగతిలో (Type V వరకు, హాస్టల్ సహా) ఖాళీలలో 4% దివ్యాంగులకు కేటాయిస్తారు. 

తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో నిబంధనల ప్రకారం 'బెంచ్‌మార్క్ డిసేబిలిటీ' కలిగి ఉన్నవారు ప్రాధాన్యత పొందుతారు. వీరు GPRA కోసం ప్రారంభ కేటాయింపు లేదా మార్పిడి కొరకు యూనిఫైడ్ వెయిటింగ్ లిస్టుపై ముందు స్థానంలో ఉంటారు. 

దివ్యాంగతకు ఆధారంగా ప్రభుత్వం జారీ చేసిన యూనిక్ డిసేబిలిటీ ఐడీ (UDID) కార్డ్ చెల్లుబాటు అయ్యే ధృవీకరణ పత్రంగా పరిగణిస్తారు. RPwD చట్టంలోని సెక్షన్ 2(r) ప్రకారం నిర్వచించిన 'బెంచ్‌మార్క్ డిసేబిలిటీ'కి అనుగుణంగా ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది.

కేటాయింపులు పూర్తిగా ఆటోమేటెడ్ సిస్టమ్ ఆఫ్ అల్లాట్‌మెంట్ (ASA) ద్వారా నిర్వహిస్తారు. దివ్యాంగులుగా నమోదు చేసుకున్న అభ్యర్థులు ప్రతి నెల eSampada వెబ్‌సైట్‌లో కొత్తగా రూపొందించిన PwD కేటగిరీలో నమోదు చేయాల్సి ఉంటుంది. తమ ప్రొఫైల్‌ను అప్డేట్ చేయడంలో UDID కార్డ్‌ను అప్‌లోడ్ చేసి, ఆయా అభ్యర్థుల శాఖలు వాటిని ధృవీకరించాల్సి ఉంటుంది.

ఈ మార్గదర్శకాలను అమలు చేయడానికి eSampada ప్లాట్‌ఫారంలో అవసరమైన సాంకేతిక మార్పులు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) సహకారంతో చేపట్టనున్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రాంతీయ కార్యాలయాలకు దీనిపై స్పష్టమైన సూచనలు పంపారు. ఈ నిర్ణయం, దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ, సమాజంలో వారికి సమాన అవకాశాలు కల్పించే దిశగా ఒక గొప్ప చర్యగా నిలుస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్
గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?