
కేంద్ర ప్రభుత్వం 2027లో జరగనున్న జనగణన కోసం రూ. 11,718 కోట్లు ఆమోదించింది. ఈసారి దేశ చరిత్రలో మొదటిసారి పూర్తిగా డిజిటల్ జనగణన జరగనుంది. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా రియల్ టైమ్ సమాచారం సేకరిస్తారు. 2011 తర్వాత ఇదే మొదటి జనగణన. 2021 సర్వే కరోనా కారణంగా ఆగిపోయింది.
భారతదేశంలో జనగణన 150 ఏళ్లకు పైగా జరుగుతోంది. చివరిసారి 2011లో జనగణన పూర్తయింది. కొత్తగా 2027 మార్చి 1 అర్థరాత్రి సమయాన్ని ఆధారంగా తీసుకుని దేశ జనాభా లెక్కింపులు చేస్తారు. ఇది స్వతంత్ర భారత్‌లో ఎనిమిదో, మొత్తం మీద 16వ జనగణన.
జనగణనను రెండు దశలుగా విభజించారు:
• మొదటి దశ (ఏప్రిల్–సెప్టెంబర్ 2026):
దేశం అంతా ఇళ్ల సంఖ్య, పరిస్థితి, సౌకర్యాల వివరాలు సేకరిస్తారు. ఏ రాష్ట్రం అయినా 30 రోజుల సమయం ఎంచుకోవచ్చు.
• రెండో దశ (ఫిబ్రవరి 2027):
లద్దాఖ్, జమ్ముకశ్మీర్ కొండ ప్రాంతాలు, హిమాచల్, ఉత్తరాఖండ్ మంచు ప్రాంతాల్లో సర్వేను 2026 సెప్టెంబర్‌లోనే పూర్తి చేస్తారు. అక్కడ శీతాకాలంలో సర్వే చేయడం కష్టమవుతుంది.
2027 జనగణనలో అతిపెద్ద మార్పు డిజిటల్ ప్రక్రియా.
* అన్ని వివరాలు ప్రత్యేక మొబైల్ యాప్‌లో రికార్డ్ అవుతాయి
* రియల్‌టైమ్ అప్‌డేట్ కావడం వల్ల తప్పుల అవకాశాలు తగ్గుతాయి
* ప్రజలు స్వయంగా ఆన్‌లైన్‌లో ఫామ్ పూరించుకునే అవకాశం ఉంటుంది
* ఇళ్ల లొకేషన్ నమోదు కోసం కొత్త వెబ్ మ్యాప్ టూల్ ఉపయోగిస్తారు
ఈ మార్పులతో సర్వే వేగంగా, కచ్చితంగా, పారదర్శకంగా పూర్తి అవుతుంది.
2027 జనగణనలో కుల సమాచారం కూడా సేకరిస్తారు. స్వతంత్ర భారత్‌లో తొలిసారి కుల డేటా డిజిటల్ రూపంలో రికార్డ్ అవుతుంది. ఇది సామాజిక విధానాల రూపకల్పనలో కీలకం అవుతుంది. ప్రతి వ్యక్తి పాల్గొనడం కోసం దేశవ్యాప్తంగా పెద్ద స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రామాలు, పట్టణాలు, మెట్రో నగరాల వరకు ప్రచారాన్ని విస్తరిస్తారు.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌లలో ఒకటిగా నిలవనుంది. దాదాపు 30 లక్షల మంది సిబ్బంది పనిచేయనున్నారు. ఎక్కువగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విధుల్లో పాల్గొంటారు. 18,600 మంది టెక్నికల్ టీమ్ 550 రోజుల పాటు సిస్టమ్ నిర్వహణ చేయనుంది. మొత్తం ప్రక్రియ వల్ల 1.02 కోట్ల ఉద్యోగ దినాలు రానున్నాయి. ఈ భారీ వ్యవస్థ భారతదేశ చరిత్రలో అత్యాధునిక డిజిటల్ జనగణనగా నిలిచే అవకాశం ఉంది.