
చెన్నై: దేశంలో కరోనా కేసులు(Corona Cases) భారీగా పెరిగాయి. తాజాగా, 24 గంటల్లోనే సుమారు లక్షన్నర కేసులు నమోదయ్యాయి. చాలా రాష్ట్రాలు కరోనా కట్టడికి ఆంక్షలు విధించాయి. కొన్ని రాష్ట్రాలు స్కూళ్లపైనా ఆంక్షలు విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో ప్రజా రవాణాపైనా ఆందోళనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సదరన్ రైల్వే(Southern Railway) కీలక ప్రకటన చేసింది. టీకా వేసుకోకుండా చెన్నై లోకల్ ట్రైన్‌లో ప్రయాణించరాదని పేర్కొంది. రెండు డోసులు(Double Dose) ఉంటేనే ఈ రైళ్లలోకి అనుమతించనున్నారు. జనవరి 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి.
రెండు డోసుల టీకాలు వేసుకున్నట్టు సర్టిఫికేట్ ఉన్నవారినే ట్రైన్‌లో ప్రయాణించడానికి అనుమతించనున్నారు. రెండు డోసుల టీకా వేసుకన్న వారు మాత్రమే ట్రైన్ టికెట్ కొనుగోలు చేయడానికి అనుమతులు ఉన్నాయని సదరన్ రైల్వే ప్రకటించింది. సీజన్ టికెట్ తీసుకున్నవారికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. జనవరి 10వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో మొబైల్‌లో అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ అందుబాటులో ఉండదని ఆ ప్రకటన వెల్లడించింది.
తమిళనాడులో శుక్రవారం 8,981 కొత్త కేసులు నమోదయ్యాయి. చెన్నై, కోయంబత్తూర్, కాంచీపురం, తిరువళ్లూర్‌లలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కాగా, రాజధాని నగరం చెన్నైలో 4,531 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. కాగా, తమిళనాడులో 121 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. కాగా, 117 మంది ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రికవరీ అయ్యాయి. కాగా, 24 గంటల్లో ఎనిమిది మంది కరోనా పేషెంట్లు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాలు 36,833కు చేరాయి. గడిచిన 24 గంటల్లో 984 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. దీంతో మొత్తం 27,00,763 రికవరీలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో అంటే.. ఒక్క రోజులోనే ఏకంగా దాదాపు లక్షన్నర మంది కరోనా బారినపడ్డారు. Covid-19 మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ భయం ప్రజలు మరింతగా ఆందోళనకు గురిచేస్తున్నతి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,41,986 కేసులు నమోదయ్యాయి. ఇది ఏడు నెలల గరిష్టం. కేవలం ఎనిమిది రోజుల్లోనే Covid-19 మహమ్మారి ఏడు నెలల రికార్డును బ్రేక్ చేసింది. దేశంలో ఏడు నెలల తర్వాత రోజువారి Coronavirus కేసులు మళ్లీ లక్ష మార్క్ దాటి పరుగులు పెడుతున్నాయి. కేవలం తొమ్మిది రోజుల్లోనే డైలీ కేసుల సంఖ్య పదివేల నుంచి లక్ష మార్క్ దాటి.. లక్షన్నరకు చేరువైంది. అలాగే, గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా 285 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కరోనా మహమ్మారితో 4,83,178 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా బారినపడ్డవారి సంఖ్య 3,53,68,372కు చేరింది.