
హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు ఈ సాయంత్రం జరగనున్నాయి. ఉదయం సైనిక సిబ్బంది సందర్శనార్థం రావత్, ఆయన సతీమణి మధులిక పార్థివదేహాలను కామ్‌రాజ్ మార్గ్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. అక్కడి నుంచి కాసేపటి క్రితం అంతిమయాత్ర ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాల నడుమ రావత్ దంపతుల అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
అంతిమ యాత్రలో.. త్రివిధ దళాల్లోని అన్ని ర్యాంకులకు చెందిన 99 మంది, 33 మంది ట్రైసర్వీస్ బ్యాండ్ ముందు వెళ్లనుంది. మరో 99 మందితో కూడిన త్రివిధ దళాల బృందం రేర్ ఎస్కార్ట్‌గా అంతిమయాత్రను అనుసరించనుంది. సీడీఎస్ అంతిమ సంస్కారాల్లో మొత్తం 800 మంది సర్వీసు సిబ్బంది పాల్గొననున్నారు. అంత్యక్రియల సమయంలో గౌరవసూచికంగా 17 గన్ సెల్యూట్ నిర్వహించనున్నారు.
ALso Read:Bipin Rawat Chopper Crash: హెలికాప్టర్ ప్రమాదంపై ఊహాగానాలకు దూరంగా ఉండాలి.. వైమానిక దళం ప్రకటన
కాగా.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ (General Bipin Rawat), ఆయన సతీమణి మధులిక రావత్‌తో పాటుగా 13 మంది ఈ ప్రమాదంలో మరణించారు. ప్రాణాలతో బయటపడిని గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌కు బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్ కమాండ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అయితే సుప్రీం కోర్టు న్యాయమూర్తితో ఈ ప్రమాదంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే ఈ ప్రమాదానికి.. వాతావరణ పరిస్థితులే కారణమా..?, సాంకేతిక లోపం వల్లే జరిగిందా..?, ఏమైనా కుట్రం కోణం దాగి ఉందా అనే ప్రశ్నలు కొందరు లెవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత వైమానిక దశం (indian air force).. కీలక ప్రకటన చేసింది. ఎటువంటి స్పష్టమైన సమాచారం లేని ఊహాగానాలకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రమాదంపై విచారణను త్వరగా పూర్తి చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు వైమానిక దళం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ఇక, ఇప్పటికే ప్రమాదం జరిగిన స్థలం నుంచి అధికారులు బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసున్న సంగతి తెలిసిందే. ఘటన స్థలానికి 300 మీటర్ల దూరంలో ప్రత్యేక బృందం బ్లాక్ బాక్స్‌ను గుర్తించింది. దానిని విశ్లేషణ నిమిత్తం తరలించారు. మరోవైపు ప్రమాద ఘటనపై విచారణ మొదలైందని ఇప్పటికే అధికారులు తమిళనాడుకు చేరుకున్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మంగళవారం పార్లమెంట్ వేదికగా వెల్లడించిన సంగతి తెలిపిందే. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సిగ్ నేతృత్వంలో త్రివిధ దళాలు సంయుక్తంగా ఈ ఘటనపై దర్యాప్తు జరపనున్నట్టుగా తెలిపారు.