
2013లో హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్యకు సంబంధించి దర్యాప్తును పూర్తి చేశామని, దర్యాప్తు అధికారి సంబంధిత అధికారికి ముగింపు నివేదికను సమర్పించారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సోమవారం బాంబే హైకోర్టుకు తెలిపింది. అయితే ఈ కేసును సీబీఐ సరిగ్గా దర్యాప్తు చేయలేదని, ఇంకా చాలా లొసుగులు ఉన్నాయని దభోల్కర్ కుమార్తె తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.
మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి వ్యవస్థాపకుడు అయిన దభోల్కర్ (67)ను 2013 ఆగష్టు 20వ తేదీన పూణేలో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో సనాతన్ సంస్థకు చెందిన రాడికల్ సంస్థతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు నిందితులపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ నెల ప్రారంభంలో హైకోర్టు ఈ కేసుపై దర్యాప్తు స్థితిని సీబీఐని కోరింది.
ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసిందని సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) అనిల్ సింగ్ సోమవారం న్యాయమూర్తులు ఏఎస్ గడ్కరీ, పీడీ నాయక్‌లతో కూడిన డివిజన్ బెంచ్‌కు తెలిపారు. ‘‘సీబీఐకి సంబంధించినంత వరకు దర్యాప్తు జరిగింది. ఇప్పుడు పూర్తయింది. 32 మంది సాక్షులలో 15 మందిని ఇప్పటికే విచారించారు’’ అని సింగ్ కోర్టుకు అన్నారు.
అయితే దర్యాప్తు అధికారి కేసును మూసివేయాలని సిఫార్సు చేస్తూ నివేదికను సమర్పించారు. ఏజన్సీ అధికార యంత్రాంగం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మూసివేత నివేదికపై నిర్ణయం తీసుకోవడానికి ఏఎస్ జీ మూడు వారాల సమయం కోరింది. దీనిని హైకోర్టు అంగీకరించి మూడు వారాల తర్వాత తదుపరి విచారణకు వాయిదా వేసింది.
కేసు దర్యాప్తు పురోగతిని కోర్టు పర్యవేక్షించాలని కోరుతూ నరేంద్ర దభోల్కర్ కుమార్తె ముక్తా దభోల్కర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. 2014లో సామాజిక కార్యకర్త కేతన్ తిరోద్కర్, ఆ తర్వాత ముక్తా దభోల్కర్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసింది. అప్పటి నుంచి కేసు పురోగతిని హైకోర్టు పర్యవేక్షిస్తోంది. 2014లో పూణె సిటీ పోలీసుల నుంచి కేసును స్వాధీనం చేసుకున్న సీబీఐ, ఇప్పటి వరకు ఈ కేసులో ఐదుగురు నిందితులుగా చార్జిషీటు దాఖలు చేసింది.
భారత్ కు తన బాధ్యతలెంటో తెలుసు - చండీగఢ్ జీ 20 సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్
కాగా.. ముక్తా దభోల్కర్ తరఫు న్యాయవాది అభయ్ నేవాగి సోమవారం హైకోర్టు ముందు వాదనలు వినిపిస్తూ, ఈ కేసును సీబీఐ సరిగా విచారించలేదని, ఇంకా చాలా లొసుగులు ఉన్నాయని విచారణ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును కొనసాగించాలని ఆయన హైకోర్టును కోరారు.